లైసెన్స్‌డ్ ఫార్మసీల్లోనే విక్రయించేలా కేంద్రం నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: దగ్గు మందు సహా పలురకాల సిరప్‌ల నాణ్యత, రోగుల ఆరోగ్య భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను ప్రకటించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇలాంటి సిరప్‌లను ఇకపై విక్రయించరాదంటూ కఠిన నిబంధనలను తీసుకు వచ్చింది. ఇందుకు గాను డ్రగ్స్ రూల్స్–1945లో కీలక సవరణలు చేసింది. ఇకపై లైసెన్సు కలిగిన ఔషధ దుకాణాల్లోనే సిరప్‌లను విక్రయించాలంటూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
షెడ్యూల్– కె జాబితాలోని దగ్గు సిరప్ తదితర మందులను ఇప్పటివరకు కొన్ని నిబంధనల నుంచి మినహాయింపు కల్పిస్తూ వెయ్యి లోపు జనాభా ఉన్న గ్రామాల్లోని దుకాణాల్లో విక్రయించేందుకు అనుమతి ఉండేది. తాజాగా, సిరప్ అనే పదాన్ని ఈ మినహాయింపు జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. దీంతో దగ్గు మందులకు ఇకపై మినహాయింపు వర్తించదు. చిన్న గ్రామాల్లోని దగ్గు మందుల విక్రయదారులు, పంపిణీదారులు కూడా ఇకపై ’డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్–1940 నిబంధనలను విధిగా పాటించాలి. దీని ప్రకారం, లైసెన్స్ పొందిన మెడికల్ షాపులు మాత్రమే వీటిని విక్రయించాల్సి ఉంటుంది. సిరప్ రూపంలో ఉండే మందులపై నియంత్రణ పర్యవేక్షణను మరింత కఠినం చేసేందుకు, ప్రజారోగ్య, భద్రతా అవసరాలకు అనుగుణంగా ఈ సవరణ చేసినట్లు పేర్కొంది.


