సాక్షి,న్యూఢిల్లీ: తమ ప్లాట్‌ఫామ్‌లలోని ప్రధాని మోదీ వీడియో తొలగింపు, బాలల లైంగిక వేధింపులు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం క్షమాపణలు చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి.
జులై 23న నీట్‌పేపర్ లీకేజీ ఆందోళనలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ వీడియోలను మెటా నేతృత్వంలోని అన్నీ ఫ్లాట్‌ఫారమ్ మెటా,ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి తొలగించింది. కొద్ది సేపటికే ఆ వీడియోలను పునరుద్ధరించింది.
అయితే, ప్రధాని వీడియో తొలగింపుపై క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటరీ ప్యానెల్ జుకర్ బర్గ్‌ను కోరింది. అందుకు మెటా స్పందించింది. పొరపాటున కంటెంట్‌ను తొలగించి, ప్లాట్‌ఫామ్‌లో పునరుద్ధరించినట్లు కంపెనీ తెలిపింది. మెటా వివరణపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వివరణ సరిపోదని అభిప్రాయపడింది.
ఈ క్రమంలో నిషికాంత్ దూబే నేతృత్వంలోని పార్లమెంటరీ ఐటీ కమిటీ కూడా మూడు రోజుల అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఐటీ చట్టం సెక్షన్ 79 కింద మెటాకు ఉన్న ‘సేఫ్ హార్బర్’ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం, పార్లమెంటరీ ప్యానెల్ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో మెటా గ్లోబల్ ఉన్నతాధికారులు ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన లోపాలను అంగీకరిస్తూ మార్క్ జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేసినట్లు, ప్రధాని మోదీతో పాటు భారత ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణలు తెలిపినట్లు తాజా జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేశాయి.


