ఫేస్‌బుక్ వివాదం.. కేంద్రం యాక్షన్! | Centre Summons Meta Team Over Algorithms and Content Moderation Concerns | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ వివాదం.. కేంద్రం యాక్షన్!

Jul 31 2026 7:59 PM | Updated on Jul 31 2026 8:14 PM

Centre Summons Meta Team Over Algorithms and Content Moderation Concerns

భారత ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను కొంతసేపు పరిమితం చేసిన ఘటన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం మెటా సంస్థపై మరింత దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై.. మెటా గ్లోబల్ బృందాన్ని భారత్‌కు పిలిపించి.. సంస్థ విధానాలు, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలపై వివరణ కోరాలని నిర్ణయించింది.

మెటా ప్రతినిధులను ముఖ్యంగా అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయి?, వినియోగదారులకు ఏ కంటెంట్ చూపించాలి?, అనే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, కంటెంట్ మోడరేషన్‌లో ఏమైనా పక్షపాతం ఉందా?, అనే అంశాలపై ప్రశ్నించనున్నారు. అంతే కాకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజా శాంతి, సమాజంపై చూపించే ప్రభావం గురించి కూడా చర్చ జరగనుంది. దీంతో.. మెటా గ్లోబల్ బృందం వచ్చే వారం మధ్యలో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని, అనంతరం పార్లమెంటరీ కమిటీ ముందు కూడా హాజరుకానుందని సమాచారం.

సోషల్ మీడియా సంస్థలు భారతదేశంలో పనిచేస్తున్నప్పుడు.. దేశ చట్టాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి షేర్ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్టును తాత్కాలికంగా పరిమితం చేసింది. ఈ పోస్టులో పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ వివరణపై కేంద్రం సంతృప్తి చెందలేదని సమాచారం.

ఈ పరిణామాల తర్వాత ప్రధాని మోదీతో పాటు ఇతర ప్రముఖుల ఖాతాల నుంచి వచ్చే పోస్టులపై మరింత పర్యవేక్షణ ఉంటుందని మెటా తెలిపింది. ముఖ్యమైన ఖాతాల కంటెంట్‌ను సీనియర్ అధికారులు పలు స్థాయిల్లో పరిశీలించే విధంగా అదనపు భద్రతా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ కేంద్రానికి వివరించింది.

ఇదే సమయంలో.. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని మార్ఫింగ్ చేసిన చిత్రాలు, ఏఐ ద్వారా రూపొందించిన తప్పుడు పోస్టులు ప్రచారం చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు కొన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదు చేశారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడంలో సంస్థలు బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సోషల్ మీడియా అధిక వినియోగం పిల్లలు, పెద్దల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement