బంజారాహిల్స్: కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేసింది. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించి రేషన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. వేసవి కాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేశారు. జూలై 1 నుంచి నెల వారి రేషన్ పంపిణీ ప్రారంభించారు. కరువు పరిస్థితులు నెలకొన్న క్రమంలో మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు.
22 రోజులు షాపులు ఓపెన్..
ఖైరతాబాద్ రేషనింగ్ సర్కిల్–7 పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజక వర్గాల పరిధిలో ఉన్న సోమాజిగూడ, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, కారి్మకనగర్, వెంగల్‌రావునగర్, రాజీవ్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట, సనత్‌నగర్, బల్కంపేట డివిజన్ల పరిధిలో ఉన్న 81 రేషన్ దుకాణాల పరిధిలో మూడు నెలల కోటా పంపిణీ చేస్తున్నారు.
ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి బియ్యం పంపిణీ చేసేవారు. అయితే మూడు నెలల కోటా పంపిణీ సందర్భంగా ఆగస్టులో 22 రోజులు షాపులు తెరిచి ఉంచాలని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సరిపడా బియ్యాన్ని షాపుల్లో సిద్ధంగా ఉంచారు. రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజూ ఆయా రేషన్ షాపులను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు.



