ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో డీజీపీ హోదాలో పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిణి లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో అత్యంత అసభ్యకర, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఖాతాపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళా అధికారి పరువుకు భంగం కలిగించేలా, అసభ్య పదజాలంతో పోస్టు చేసినట్లు గుర్తించిన టీజీసీఎస్‌బీ సైబర్ ప్యాట్రోలింగ్ బృందం స్వయంగా (సుమోటో) ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. టీజీసీఎస్‌బీ ప్రధాన కార్యాలయంలో సైబర్ ప్యాట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆగస్టు ఒకటిన సైబర్ పర్యవేక్షణలో భాగంగా "IMRANKHAN(@Shailubha 007 పేరుతో ఉన్న ఎక్స్ ఖాతాలో సీనియర్ మహిళా ఐపీఎస్ అధికారిపై అత్యంత అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేసిన పోస్టును గుర్తించారు. ఆ పోస్టులోని పదజాలం మహిళా అధికారిని మాత్రమే కాకుండా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, యూఆర్‌ఎల్‌లు తదితర డిజిటల్ ఆధారాలను భద్రపరిచిన అనంతరం టీజీసీఎస్‌బీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి అసలు వివరాలు, సబ్‌స్క్రైబర్ సమాచారం, ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులను సంబంధిత సోషల్ మీడియా వేదిక నుంచి సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. పోస్టు చేసిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తును ఇన్‌స్పెక్టర్ ఎం.రవికుమార్‌కు అప్పగించారు.


