సొంతింటిలో దసరా! | Telangana Govt Plans To Complete Construction Of 25,000 Pending Double-Bedroom Houses Before Dasara, More Details Inside | Sakshi
Sakshi News home page

సొంతింటిలో దసరా!

Aug 4 2026 9:02 AM | Updated on Aug 4 2026 10:17 AM

Dasara Gift for Poor: Double Bedroom Houses to Be Completed Soon

సాక్షి, హైదరాబాద్‌: పెద్ద పండగ దసరాకు పేదలకు సొంతిళ్లు కానుకగా అందజేసేందుకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. క్యూర్‌ పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పూర్తి చేసేందుకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టు పనులను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు ప్రాజెక్టును రెండు డివిజన్లుగా విభజించి డివిజన్‌ –1 పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులను, డివిజన్‌ –2 పరిధిలో మేడ్చల్‌–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులను చేర్చి ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసింది. మొత్తం లక్ష గృహాల లక్ష్యానికి గాను అసంపూర్తిగా నిలిచిపోయిన సుమారు 25,619 గృహాల్లో ఇప్పటికే 4,296 నిర్మాణాలు పూర్తికాగా,  మిగిలిన 21,323 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. తాజాగా వాటి నిర్మాణాలను వేగవంతం చేసేందుకు హౌసింగ్‌ శాఖ కార్యాచరణకు సిద్ధమైంది.

గ్రీన్‌  ఛానల్‌ ద్వారా నిధులు 
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రతి సోమవారం గ్రీన్‌ ఛానల్‌ ద్వారా నిధులు విడుదల చేస్తున్నట్లే.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలకు సైతం నిధుల కొరత లేకుండా చూసేందుకు గృహనిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. బిల్లులను ఎప్పటికప్పుడు ప్రాసెస్‌ చేసి విడుదల చేసే విధంగా ఆరి్థక శాఖ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. దీంతో ఇటీవల హౌసింగ్‌ శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టు కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయి సమస్యలను, అడ్డంకులను అడిగి తెలుసుకున్నారు. నిధుల సమస్యలు లేకుండా చూస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు సెపె్టంబర్‌ 15వ తేదీ నాటికి పనులు పూర్తి చేసేలా గడువు విధించారు. నిధుల చెల్లింపుల్లో ఆలస్యం లేనందున పనులు వేగంగా జరగవచ్చని హౌసింగ్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు.  

స్థానికంగానే ఇళ్లు 
నిరుపేదలు తమ ఉపాధి కోల్పోకుండా నివాసం ఉంటున్న ప్రాంతానికి గరిష్టంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇళ్లను కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నాంపల్లి, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, కుతుబుల్లాపూర్, పటాన్‌చెరు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల ప్రాజెక్టులను పూర్తి చేసేలా హౌసింగ్‌ శాఖ చర్యలు చేపట్టింది. ప్రతి సముదాయంలో విద్యుత్‌ సరఫరా, మంచినీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement