పటాన్‌చెరు టౌన్: చిట్టీల పేరుతో దాదాపు రూ.2.5 కోట్ల మేర మోసానికి పాల్పడి దంపతులు పరారయ్యారు. ఈ ఘటన అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని బీఎస్‌ఆర్ కాలనీలో కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం.. శిరీష, ఆమె భర్త సాంబశివరావు పదేళ్లుగా బీఎస్‌ఆర్ కాలనీలో బట్టల వ్యాపారం నిర్వహిస్తూ స్థానికులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని పలువురితో చిట్టీలు నిర్వహించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బీఎస్‌ఆర్ కాలనీతో పాటు రాఘవేంద్ర కాలనీ, బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్, సింఫనీ కాలనీ ప్రాంతాలకు చెందిన పలువురు చిట్టీల్లో చేరి నెలనెలా డబ్బులు చెల్లించినట్లు బాధితులు తెలిపారు. ఇటీవల చిట్టీల డబ్బులు చెల్లించే సమయం రాగానే శిరీష, సాంబశివరావు అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చినబాధితులు వారి ఇంటికి వెళ్లగా.. తాళం వేసి ఉండటంతో విషయం వెలుగులోకి వచి్చంది. ఇటీవల వారు ఇంటిని విక్రయించి, రాత్రికి రాత్రే కుటుంబ సమేతంగా పరారైనట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అమీన్‌పూర్ సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.


