జనగామ రూరల్: భార్యపై భర్త బెస్ బాల్ బ్యాట్‌తో దాడి చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం ఓబుల్‌కేశావాపూర్ గ్రామానికి చెందిన మోకు మహేందర్‌రెడ్డి ఎనిమిదేళ్ల క్రితం మాధవిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇటీవల మహేందర్‌కు మరో మహిళతో పరిచయం ఏర్పడడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలవడంతో మాధవి మే నెలలో సరూర్‌నగర్‌లో తల్లిగారి ఇంటికి వెళ్లిపోయింది. కాగా ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మాధవి 2వ తేదీన (ఆదివారం) గ్రామానికి వచ్చింది. పంచాయితీకి భర్త రాకపోవడంతో గ్రామ పెద్దమనుషులు ఇంటి తాళం పగలగొట్టి ఉండమని చెప్పి వెళ్లిపోయారు.
అనంతరం సుమారు 4 గంటల సమయంలో మహేందర్‌రెడ్డి ఇంటికి వచ్చి వెంట తెచ్చుకున్న బేస్‌బాల్ బ్యాట్‌తో భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డువచ్చిన మాధవి సోదరుడిని కూడా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన మాధవిని జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. దాడి అనంతరం మహేందర్ రెడ్డి ఇద్దరు పిల్లలను తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.


