చంద్రశేఖరన్‌.. ‘టాటా’!  | Natarajan Chandrasekaran has resigned from Chairman of Tata Sons | Sakshi
Sakshi News home page

చంద్రశేఖరన్‌.. ‘టాటా’! 

Aug 13 2026 5:42 AM | Updated on Aug 13 2026 5:42 AM

Natarajan Chandrasekaran has resigned from Chairman of Tata Sons

టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి గుడ్‌బై..

2027 ఫిబ్రవరిలో పదవీ కాలం ముగిశాక వైదొలగనున్నట్లు వెల్లడి

నోయెల్‌ టాటాతో విభేదాలు, పునర్నియామకంపై ప్రతిష్టంభనే కారణం  

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ కార్పొరేట్‌ సామ్రాజ్యంలో నాయకత్వ సంక్షోభం తారస్థాయికి చేరింది. గ్రూప్‌ అధిపతిగా పదేళ్ల ‘చంద్ర’ శకానికి ఇక తెరపడనుంది. టాటా సన్స్‌ చైర్మన్‌ పదవికి గుడ్‌బై చెబుతున్నట్లు నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. 2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత వైదొలగనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని బుధవారం టాటా సన్స్‌ బోర్డుకు తెలియజేశారు. నాయకత్వ మార్పు సజావుగా పూర్తయ్యేలా చూసేందుకు తన వారసుడి ఎంపికను త్వరగా పూర్తి చేయాల్సిందిగా బోర్డును కోరారు. 

కొనసాగింపుపై అనిశ్చితి... 
టాటా ట్రస్టుల చైర్మన్‌ నోయెల్‌ టాటాతో నెలకొన్న విభేదాలు, పునర్నియామకంపై సుదీర్ఘ ప్రతిష్టంభన నేపథ్యంలో చంద్రశేఖరన్‌ తాజా నిర్ణయం వెలువడింది. కాగా, టాటా సన్స్‌ చైర్మన్‌గా పునర్నియామకంపై నెలల తరబడి అనిశ్చితి కొనసాగుతోంది. గ్రూపు హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌లో 51.54 శాతం వాటా కలిగిన సర్‌ దొరాబ్జీ ట్రస్ట్, సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ మరో అయిదేళ్లపాటు చైర్మన్‌గా తన పదవీ కాలాన్ని పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్‌ తెలిపారు. 

ఈ ప్రతిపాదనను ఈ ఏడాది ఫిబ్రవరి 24న టాటా సన్స్‌ బోర్డు, ఎంపిక కమిటీ ముందుంచగా, ఒక బోర్డు సభ్యుడు (డైరెక్టర్‌) దానికి మద్దతివ్వకపోవడంతో అది ముందుకు సాగలేదన్నారు. ఈ ప్రతిపాదనతో విభేదించిన డైరెక్టర్‌ పేరును ప్రస్తావించకుండా, బోర్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే నిర్ణయం వాయిదా పడిందని వెల్లడించారు. ఆరు నెలల తర్వాత కూడా ఈ ప్రతిపాదనకు అతీగతీ లేదని, టాటా సన్స్‌ పర్యవేక్షణలో అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నందున నాయకత్వం విషయంలో అనిశ్చితి తారస్థాయికి చేరిందని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. 

నోయెల్‌ రాకతో విభేదాలు.. 
2024లో రతన్‌ టాటా మరణానంతరం టాటా ట్రస్టుల పగ్గాలు ఆయన సవతి సోదరుడైన నోయెల్‌ టాటా చేతికొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచీ చంద్ర, నోయెల్‌ మధ్య విభేదాలు మొదలయ్యాయని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టాటా సన్స్‌ లిస్టింగ్‌కు నోయెల్‌ నో చెబుతుండగా.. చంద్ర దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే బోర్డులో ప్రాతినిధ్యం విషయంలో కూడా ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. కాగా, టాటా సన్స్‌ను లిస్టింగ్‌ చేయకుండా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ను బయటికి పంపించే విధంగా ఐదేళ్ల వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌ విషయంలో స్పష్టతనివ్వాలని టాటాలు చంద్రను కోరారు. అయితే, దీనిపై చంద్ర నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో పునర్నియామకంపై ప్రతిష్టంభనకు దారితీసింది.

ఇంటర్న్‌గా చేరి.. అత్యున్నత స్థానానికి! 
→ ‘చంద్ర’గా అందరికీ సుపరిచితమైన 63 ఏళ్ల నటరాజన్‌ చంద్రశేఖరన్‌.. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి 1987లో టాటా గ్రూప్‌ కంపెనీ టీసీఎస్‌లో ఇంటర్న్‌గా చేరారు. 22 ఏళ్లలో  ఏకంగా 2009లో ఆ కంపెనీ సీఈఓ స్థానానికి చేరారు.  

→ ఇక సైరస్‌ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించిన తర్వాత తాత్కాలిక చైర్మన్‌గా కొన్నాళ్లు రతన్‌ టాటా మళ్లీ పగ్గాలు చేపట్టారు. ఆయన వారసుడిగా 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్‌ చైర్మన్‌ పదవిలో చంద్ర టాటా సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. టాటా సన్స్‌ పగ్గాలు తొలిసారి పార్సీయేతర, టాటాల కుటుంబానికి చెందని వ్యక్తికి దక్కడం విశేషం.  

→ చంద్ర హయాంలో దాదాపు దశాబ్దకాలంలో గ్రూపు ఆదాయం రెట్టింపు కాగా, లాభం మూడింతలైంది. 2024–25లో గ్రూపు మొత్తం ఆదాయం 180 బిలియన్‌ డాలర్లను దాటింది. 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలున్న టాటా గ్రూపులో 31 లిస్టెడ్‌ కంపెనీలున్నాయి. వాటి మొత్తం మార్కెట్‌ విలువ సుమారు రూ.26 లక్షల కోట్లు (360–380 బిలియన్‌ డాలర్లు). ఇది పాకిస్తాన్, పోర్చుగల్, గ్రీస్‌ ఉమ్మడి జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం. 

→ స్టీల్, ఆటో వంటి బలమైన సంప్రదాయ బిజినెస్‌ల నుంచి గ్రూపును ఏవియేషన్, ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్స్, బ్యాటరీలు, డిజిటల్‌ కామర్స్‌ వంటి ఆధునిక వ్యాపారాల దిశగా నడిపించిన ఘనత చంద్ర సొంతం. 2022లో ఏయిరిండియాను మళ్లీ టాటా గూటికి చేర్చారు. బిగ్‌బాస్కెట్, 1ఎంజీ వంటి పలు నవ తరం కంపెనీలను కొనుగోలు చేశారు. 

→ మరోపక్క, అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. 2025లో ఎయిరిండియా బోయింగ్‌ 787 విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోవడం చంద్రశేఖరన్‌కు మాయని మచ్చగా మిగిలింది. అంతేకాదు, ఎయిరిండియా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.22,238 కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏఐ ప్రభావంతో టీసీఎస్‌ సహా టెక్‌ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి, జేఎల్‌ఆర్‌పై సైబర్‌ దాడుల ప్రభావం వంటివి ఉన్నాయి.

వారసుడెవరు? 
చంద్ర ప్లేసులో టాటా గ్రూప్‌నకు కొత్త వారసుడి ఎంపిక ఇప్పుడు కత్తిమీద సామేనని పరిశీలకులు అంటున్నారు. టాటా ట్రస్టుల్లో పాలనాపరమైన విభేదాలు, గ్రూపు భారీ పెట్టుబడి లక్ష్యాలు, కొన్ని కంపెనీల భారీ నష్టాలు, టాటా ట్రస్ట్‌లు, టాటా సన్స్‌ మధ్య సరైన సమన్వయాన్ని నెలకొల్పడం, ఇతరత్రా సవాళ్ల నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని నియమించడం అంత సులువు కాదనే వాదనలున్నాయి. 

చైర్మన్‌గా మళ్లీ టాటాల కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారా లేదంటే, బయటి వ్యక్తినే కొనసాగిస్తారా అనేది కీలకంగా మారనుంది. కాగా, టాటా ట్రస్టుల చైర్మన్‌ నోయెల్‌ టాటా పేరు కూడా రేసులో ఉంది. కానీ, టాటా సన్స్‌ కొత్త నిబంధనల ప్రకారం ట్రస్టులకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి అదే సమయంలో టాటా సన్స్‌ పగ్గాలు చేపట్టడానికి వీల్లేదు. ఇదే ఆయనకు ప్రధాన అడ్డంకి. అయితే, కొత్త చైర్మన్‌ నియామకంలో మాత్రం నోయెల్‌దే కీలక పాత్ర కానుంది.

ఆధిపత్య పోరు... 
టాటా ట్రస్టులు, టాటా సన్స్‌ బోర్డుల్లో అధిపత్య పోరుతో సీనియర్లు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. 2024లో నోయెల్‌ టాటా ట్రస్ట్‌ల పగ్గాలు చేపట్టాక ఇది మరింత జోరందుకుంది. రతన్‌ టాటాకు నమ్మకస్తులైన విజయ్‌ సింగ్, మెహ్లీ మిస్త్రీ, ఇప్పుడు టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్ర నిష్క్రమణ దీనికి నిదర్శనం. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లకు సుమారు 66% వాటా ఉండటంతో బోర్డు నిర్ణయాలపై దానిదే పూర్తి ఆధిపత్యం. 

ప్రస్తుతం టాటా సన్స్‌లో చంద్ర, టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌ నోయెల్‌ టాటా, వైస్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్, గ్రూప్‌ సీఎఫ్‌ఓ సౌరభ్‌ అగర్వాల్, ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు హరీష్‌ మన్వానీ, అనితా మరంగోలీ జార్జ్‌..  ఆరుగురు డైరెక్టర్లుగా ఉన్నారు. టాటా సన్స్‌ లిస్టింగ్‌తో పాటు అనేక విషయాల్లో డైరెక్టర్లు వర్గాలుగా విడిపోవడంతో బోర్డు రూమ్‌ యుద్ధం తీవ్రమైంది. టాటా సన్స్‌ లిస్టింగ్‌ను నోయెల్‌ వ్యతిరేకిస్తుండగా.. చంద్ర తదితరులు సై అంటున్నారు. మరోపక్క, నోయెల్‌ తన కుమారుడు నెవిల్లే టాటాతో పాటు టైటాన్‌ మాజీ చీఫ్‌ భాస్కర్‌ భట్‌ను సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ (అన్నింటిలో పెద్దది)లోకి తీసుకొని మరింత పట్టుబిగించారు. బోర్డు సభ్యుల మధ్య విభేధాలు, కొందరి రాజీనామాలకు ఈ ట్రస్టే కేంద్ర బిందువుగా మారింది!!

నాయకత్వంపై స్పష్టత ముఖ్యం..
టాటా గ్రూప్‌లో 40 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పని చేశాను. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు నా వంతు సహకారం అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. నా పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, భాగస్వాములు, ఇతర పక్షాలకు నాయకత్వంపై స్పష్టత ఇవ్వడం చాలా కీలకం. అయితే, ఆరు నెలలుగా నా పునర్నియామక ప్రతిపాదనపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఫిబ్రవరి 20 తర్వాత చైర్మన్‌గా కొనసాగబోనని బోర్డుకు తెలియజేశాను.  

గ్రూపుతో 40 ఏళ్ల నా అనుబంధంలో మీరు (ఉద్యోగులు) చూపిన ప్రేమ, ఆప్యాయతలు వెలకట్టలేనివి. ఈ స్థాయికి చేరుకుంటానని ఎన్నడూ ఊహించలేదు. అయితే, ఎవరి కెరీర్‌ అయినా ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందే, మరొకరు ఆ బాధ్యతలు చేపట్టాల్సిందే. టాటా అనేది గౌరవనీయమైన పేరు. మీ కృషి వల్లే అది సాకారమైంది. సంస్థ ప్రగతి పథంలో కొనసాగుతుంది. ఉద్యోగులందరికీ అవకాశాలు లభిస్తూనే ఉంటాయి. నా నిష్క్రమణకు సంబంధించి వస్తున్న ఊహాగానాలు, వదంతులు, కుట్ర సిద్ధాంతాలను మీరెవరూ పట్టించుకోవద్దు.
– ఎన్‌. చంద్రశేఖరన్, టాటా సన్స్‌ చైర్మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement