breaking news
Unauthorized constructions
-
అనధికార భవనాల కూల్చివేతకు ఏకరూప విధానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనధికార నిర్మాణాల క్రమబద్ధీకరణ, కూల్చివేతలపై ఏకరూప విధానం రూపొందించే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అయితే ఈ దిశగా ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషనర్ సెంటర్ ఫర్ లా అండ్ గుడ్ గవర్నెన్స్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తుందని సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, క్షేత్రస్థాయి వాస్తవాల్లో తేడాలు ఉంటాయి కాబట్టి ఏకరూప విధానం సముచితం కాదని అభిప్రాయపడింది. అయితే ఈ అంశానికి సంబంధించి కొత్త విధానాలు రూపొందించేటప్పుడు లేదా ఉన్నవాటిని సమీక్షించేటప్పుడు పిటిషన్లో లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పలు సందర్భాల్లో అనధికార కాలనీలను ఎలాటి నోటీసుల్లేకుండా, పునారావాస/సంక్షేమ చర్యల్లేకుండా కూల్చి వేయడంతో చాలామంది ఆశ్రయం, జీవనోపాధి కోల్పోయారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా.. ఈ అంశాలపై కోర్టు ఇప్పటికే పలు రక్షణ చర్యలను అందుబాటోకి తెచి్చందని, కనీసం 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలని గతంలో ఆదేశించినట్లు చీఫ్ జస్టిస్ గుర్తుచేశారు. తల దాచుకునేందుకు ఒక గూడు కలిగి ఉండటం గౌరవ మర్యాదలతో బతికేందుకు మనిషికి ఉన్న హక్కుల్లో భాగమని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం గతంలోనే స్పష్టం చేసిందని, ఈ ఏడాది జూలై 14న కూడా దీర్ఘకాలం ఉనికిలో ఉన్నంత మాత్రాన అనధికార కాలనీలకు చట్టపరమైన హక్కులు రావని కూడా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసిందని చీఫ్ జస్టిస్ తెలిపారు. -
బీపీఎస్‌కు గ్రీన్‌సిగ్నల్
మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు పెరగనున్న ఆదాయం నెల్లూరు, సిటీ : అనధికార నిర్మాణాల యజమానులకు రాష్ట్రప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. భవన అపరాధ రుసుము(బీపీఎస్) పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్లో సోమవారం తీర్మానించింది. ఈ పథకం మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్ల ఖజానాకు అదనపు ఆదాయం సమకూరనుంది. నెల్లూరు నగరంలో సుమారు 4 వేల వరకు అనధికార కట్టడాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సూళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు, కావలి, ఆత్మకూరు, నాయుడుపేట మున్సిపాలిటీల్లో మరో 3 వేల అక్రమ కట్టడాలు ఉంటాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం బీపీఎస్ స్కీమ్‌ను అమలు చేయనుంది. 1998 నుంచి 2007 వరకు నిర్మితమైన భవనాలకు 2007లో బీపీఎస్ చేసుకునే విధంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. 2007 నుంచి 2010 వరకు మొదట బీపీఎస్‌ను అందుబాటులో ఉంచారు. ప్రజల సౌకర్యార్థం అప్పటి ప్రభుత్వం బీపీఎస్‌ను మరో రెండేళ్లు పొడిగించింది. ఈ వ్యవధిలో ఒక నెల్లూరు నగరంలోనే 3,800 దరఖాస్త్తులు అందాయి. అయితే కేవలం 1,700 దరఖాస్తుదారులకు మాత్రమే ఈ స్కీమ్‌ను వర్తింపజేశారు. మున్సిపాలిటీ అధికారులు సరిగా స్పందించకపోవడంతో దాదాపు 2 వేలకు పైగా దరఖాస్తులు మూలనపడ్డాయి. బీపీఎస్ విధానం అమలులో మున్సిపాలిటీ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఒకరు కట్టిన ‘డీడీ’ని మరొకరికి వినియోగించినట్లు సమాచారం. బీపీఎస్ స్కీమ్తోఐదేళ్లలో నెల్లూరు మున్సిపాలిటీకి రూ. 3కోట్ల ఆదాయం వచ్చింది. 2012 తరువాత బీపీఎస్ స్కీమ్‌ను నిలిపివేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడేళ్ల వ్యవధిలో ఏడాదికి కనీసం 500 అనుమతి లేని కట్టడాలు ఉండొచ్చని మున్సిపల్ వర్గాల అంచనా. నెల్లూరు నగరంలోనే 4వేలకుపైగా అనుమతులు లేని కట్టడాలు ఉండొచ్చని అంచనా. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కార్పొరేషన్‌కు రూ.4 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. కార్పొరేషన్‌కు ఆదాయం పెరిగే అవకాశం.. నెల్లూరు నగర పాలక సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నూతన కమిషనర్ చక్రధర్‌బాబు అక్రమ కట్టడాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. దీంతో అనుమతులు లేని కట్టడాల యజమానులు ఆందోళనలో పడ్డారు. రాష్ట్రప్రభుత్వం బీపీఎస్‌ను ఆమోదిస్తూ తీసుకోవడంతో అనధికార నిర్మాణాల యజమానులకు ఊరట లభించింది.ఈ సమయంలో యజమానులు బీపీఎస్‌ను అధిక సంఖ్యలో వినియోగించుకోనుండడంతో కార్పొరేషన్‌కు ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.


