డీజీపీ అసమర్థుడు కావడం వల్లే బాబు రంగంలోకి దిగారా?: నాని ఫైర్‌ | Perni Nani Satirical Comments On CBN And DGP | Sakshi
Sakshi News home page

డీజీపీ అసమర్థుడు కావడం వల్లే బాబు రంగంలోకి దిగారా?: నాని ఫైర్‌

Aug 13 2026 10:46 AM | Updated on Aug 13 2026 11:03 AM

Perni Nani Satirical Comments On CBN And DGP

సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన చుట్టూ ఉన్నవారి భజనతో వచ్చే కిక్ సరిపోక.. ఇప్పుడు ఖాకీ డ్రెస్‌లో ఉన్న పోలీసులతోనూ భజన చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఐలు, ఎస్పీలతో ముఖ్యమంత్రి నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. డీజీపీ అసమర్థుడు కావడం వల్లే చంద్రబాబు రంగంలోకి దిగారా? అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులను అడ్డగోలుగా ఉపయోగించుకునేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారా? అని చంద్రబాబును పేర్ని నాని ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను ఇప్పటికే భ్రష్టు పట్టించారని, ఇప్పుడు పోలీస్ స్టేషన్ల స్థాయిలోనూ అదే పరిస్థితి తీసుకురావాలని అనుకుంటున్నారా అంటూ విమర్శించారు. చంద్రబాబు ధైర్యసాహసాలను కొందరు పోలీసు అధికారులు పొగడటంపైనా తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ, ఆస్తులు, పదవులు లాక్కోవడమే ధైర్యమా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసుల్లో కఠిన శిక్షలు విధించేలా చట్టాలు మార్చాలని కొందరు ఐపీఎస్ అధికారులు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు.

పవన్‌.. స్పందించవా?
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పేర్ని నాని ఆరోపించారు. డాక్టర్ ప్రియాంకను కారుతో తొక్కి చంపిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి ఘటనలను ప్రమాదాలుగా మాత్రమే పరిగణిస్తారా? అని ప్రశ్నించారు. మహిళల భద్రతపై ఎన్నో సమావేశాల్లో మాట్లాడే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ప్రియాంక ఘటనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కొందరు పోలీసుల తీరుతో ఖాకీ దుస్తుల పరువే పోతోందని వ్యాఖ్యానించారు.

అమరావతి అంశంపైనా ప్రభుత్వాన్ని నాని ప్రశ్నించారు. అమరావతి పేరుతో ఛానళ్లకు డబ్బులు ఇచ్చి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణాన్ని గొప్పగా చూపిస్తున్నారని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు వాటిలో ఉంటారో చూద్దామని అన్నారు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల భూములు కావాలి కానీ వారి కష్టాలు పట్టవా?. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బోండా ఉమకు సవాల్‌.. 
ఇక ఎమ్మెల్యే బోండా ఉమాపై కూడా పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై, తన భార్యపై 50 కోట్ల రూపాయల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను, తన భార్య ఎవరి ఇంటికి వెళ్లారో చెబుతున్న వ్యక్తులు అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలు, వీడియోలను బయటపెట్టాలని సవాల్ చేశారు. ‘నేను, నా భార్య 50 కోట్లు ఇచ్చి ఉంటే మమ్మల్ని లోపల వేయండి. చంద్రబాబు నా దగ్గర 50 కోట్లు తీసుకుని ఉంటే ఆయన్నూ లోపల వేయండి’ అని సవాల్ విసిరారు. తనపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి దిగజారకూడదని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement