దేశానికి మేధావులు ఎంతో కీలకం. వారు దేశాన్ని నడిపే రాజకీయ నేతలకు సరైన మార్గ నిర్దేశనం చేస్తే సమాజానికి మేలు చేసినవారు అవుతారు. కాని అదే మేధావులు కూడా, తమ స్వార్థ ప్రయోజనాలకోసమో, లేక ఏదో పార్టీకి మేలు చేయడం కోసమో రాజకీయ కోణంలో మాట్లాడితే అది దేశానికి తీరని నష్టం చేసినవారు అవుతారు. దురదృష్టవశాత్తు కొందరు మేధావుల ముసుగులో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగాను, మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరో రకంగా మాట్లాడుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆ జాబితాలో ఆర్థికవేత్తగా ఉన్న సూర్యదేవర మహేంద్రదేవ్ కూడా చేరడం బాధాకరంగా ఉంది.
ప్రముఖ చిత్రకారుడు సూర్యదేవర సంజీవదేవ్ అంటే తెలుగు ప్రజలకు ఎంతో గౌరవం. అలాంటి గొప్పవ్యక్తి కుమారుడు అయిన మహేంద్రదేవ్ గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ఎంత తేడా ఉందో చూడండి. ఇది ఆయనకు అప్రతిష్ట అవుతుందా? కాదా? అన్నదానిని పక్కనబెడితే, ప్రముఖ ఆర్థికవేత్తలు చెప్పే విషయాలను కూడా నమ్మకూడదన్న అభిప్రాయం ప్రజలలో కలగదా? అది మేధావి వర్గానికి సిగ్గు చేటు అవుతుందా? కాదా?
మహేంద్రదేవ్ 2024 ఎన్నికలముందు ఏప్రిల్ నెలలో ఎల్లో మీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆంధ్రాకు అప్పులే శాపం అని వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఆధారంతో అన్నారో తెలియదు కాని ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు దాటిపోయాయని విమర్శించారు. అందులో ఏ ప్రభుత్వ వాటా ఎంత అన్నది చెప్పినట్లు లేరనుకోండి. ఇది సరిగ్గా ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలిగా ఆ రోజుల్లో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వంటివారు చెప్పిన అసత్య మాటల మాదిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది గదా!
నిరుద్యోగం తాండవిస్తోందని, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలా అని మహేంద్రదేవ్ ప్రశ్నించారు. ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుందని, దీర్ఘకాలంలో అన్ని రంగాలపైన దుష్ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. అప్పటి జగన్ ప్రభుత్వం చేపట్టిన స్కూళ్లు, ఆస్పత్రులను నాడు-నేడు స్కీమ్ కింద బాగు చేయడం పట్ల కూడా అంత సంతృప్తి చెందలేదు. జీడీపీలో అది ఐదు శాతంకన్నా తక్కువేనని ఆయన ఆనాడు వ్యాఖ్యానించారు. కారణం ఏదైతేనేం.. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. లోకేష్ కీలక మంత్రిగా మారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారితో పాటు మహేంద్రదేవ్‌కు కూడా ప్రధాని కార్యాలయంలో ఆర్థిక సలహామండలి చైర్మన్ పదవి వచ్చింది. ఇక అంతా ఆల్ హాపీస్ అన్నమాట.
తాజాగా ఆయన ఎల్లో మీడియాలోని మరో పత్రిక ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎమన్నారో తెలుసా! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందడంలో అర్థం లేదట. అప్పులను కేవలం సంఖ్య రూపంలో కాకుండా జీడీపీతో పోల్చి చూడాలట. అంతేకాదు.. చంద్రబాబుకు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు. అమరావతి నిర్మాణంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, చంద్రబాబు మిగిలిన ప్రాంతాలను విస్మరించడం లేదని తెలిపారు. ఇవన్ని చదివితే ఏమి అర్థం అవుతుంది. బహుశా చంద్రబాబు సిఫారస్‌తోనే కేంద్రంలో ఈయనకు పదవి వచ్చిందేమో అన్న అనుమానం జనానికి కలగదా!
ఆయన నిజాయితీగా చెప్పదలిస్తే ఏమి వివరించాలి.. గత ఎన్నికలకు ముందు ఏపీ అప్పు 14 లక్షలు ఉందని ఎందుకు చెప్పవలసివచ్చిందో వివరించాలి కదా! ఆ పని చేయలేదు. ప్రస్తుతం లోక్ సభ ఇచ్చిన వివరాల ప్రకారం ఏపీ అప్పు 6.45 లక్షలే అని ఎందుకు ఉంది? అంటే మహేంద్రదేవ్ కావాలనే జగన్ ప్రభుత్వంపై బురద వేసినట్లు అవ్వలేదా? జగన్ తన టరమ్‌లో రెండేళ్ల కరోనా సంక్షోభాన్ని ఎదుర్కున్నా ఐదేళ్ల పీరియడ్‌లో వైఎస్సార్‌సీపీ టైమ్‌లో జరిగిన అప్పు 3.63 లక్షల కోట్లేనని వెల్లడవుతోంది కదా! కాని కూటమి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు సర్కార్ 3.60 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసిందో ప్రభుత్వంలోని వారు చెప్పలేకపోతున్నారు. కనీసం మహేంద్రదేవ్ అయినా చెప్పి ఉంటే బాగుండేది కదా!
అమరావతి నిర్మాణంతో ప్రయోజనాలు ఉన్నాయట. ఎవరూ రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేయవద్దని చెప్పడం లేదు. అభివృద్ది అన్నది సహజ సిద్దంగా ఉండాలి కాని, లక్షల కోట్ల వ్యయం చేసి, రియల్ ఎస్టేట్ వెంచర్ మాదిరి చేయవద్దని కదా చాలామంది సలహా ఇస్తున్నది! ఒకే ప్రాంతంలో ఇప్పటికే 50 వేల కోట్లను, అది కూడా అప్పు చేసి ఖర్చు చేస్తుంటే మిగిలిన ప్రాంతాలవారికి అది అసంతృప్తి కలిగించదా? జగన్ మావిగన్ ప్రతిపాదన చేస్తే దాని గురించి మాట్లాడకుండా మూడు రాజధానులు అంటూ ఇప్పుడు అవసరం లేని ప్రస్తావన మహేంద్రదేవ్ తేవడం వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుంది.
జగన్ సంక్షేమ స్కీముల వల్ల ఉపయోగం లేదని అప్పట్లో చెప్పారు. మరి అంతకన్నా ఎక్కువ అమలు చేస్తామని, సంపద సృష్టిస్తామని చంద్రబాబు టీమ్ ప్రచారం చేసిందే! ఈ రెండేళ్లలో సంపద సృష్టించలేదే. ఖజానా ఖాళీ అయిందని, సంపద ఎలా సృష్టించాలో చెవిలో చెప్పండని చంద్రబాబు అడిగారే! కనీసం మహేంద్రదేవ్ అయినా ఆయన చెవిలో సలహా ఇచ్చి ఉండాల్సింది కదా! ఇక ఈనాడు మీడియా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాసిన కొన్ని అబద్దపు కథనాలు, పెట్టిన హెండింగ్‌లు చూస్తే జర్నలిజాన్ని ఇంత నీచంగా మార్చారా అన్న బాధ కలుగుతుంది. కొన్ని ఉదాహరణలు చూడండి..
జగన్ బొమ్మవేసి రుణ కంఠుడు అంటూ హెడింగ్ పెట్టి, పది లక్షల కోట్ల అప్పు దాటించిన ఘనుడు అని రాసింది. పురందేశ్వరి రాష్ట్ర అప్పులు 12.50 లక్షల కోట్లు అని ఆరోపించారు. మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు 11 లక్షల కోట్లు అప్పు అంటూ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేస్తూ అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు. శ్రీలంక కంటే నాలుగు రెట్ల అప్పుల ఏపీ అని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయనే ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ శ్రీలంక ఏమైందో, ఇప్పుడు తామెందుకు భారీ అప్పులు చేస్తున్నారో కేశవ్ చెప్పడం లేదు.
శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం అని పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ చేశారు. మేలుకోకుంటే మనకూ శ్రీలంక గతే అని ఈనాడు గుండెలు బాదుకున్నారు. శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అని చంద్రబాబు విమర్శించారు. ఇవన్ని జగన్ ప్రభుత్వంపై ప్రచారం చేసిన అబద్దాలు. వారు అప్పట్లో చేసిన ఆరోపణలన్నిటిని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నిజం చేస్తోందేమో అని ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని బుద్దిజీవులు వ్యాఖ్యానిస్తున్నారు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


