టీడీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ కుటుంబంతో లీలావతి ఆమె కొడుకు
యువ ఫ్యాషన్ డిజైనర్‌తో టీడీపీ నాయకురాలు వెట్టిచాకిరీ
తిండి పెట్టకుండా, జీతం ఇవ్వకుండా నిర్బంధం
చిత్తూరు టీడీపీ నగర మహిళా అధ్యక్షురాలు.. ఆమె కుమారుడి ‘లీల’లు
సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఘటన
సెల్ఫీ వీడియోలో బాధితురాలు కన్నీటిపర్యంతం
చిత్తూరు అర్బన్: సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఓ యువ మహిళా ఫ్యాషన్ డిజైనర్‌కు నరకం ఎలా ఉంటుందో టీడీపీ నేతలు చూపించారు. నెలల తరబడి వెట్టిచాకిరీ చేయించుకుని ఇంట్లో నిర్బంధించారు. కనీసం తిండి కూడా పెట్టకుండా, జీతం సైతం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకున్నారు. ఓ దశలో.. ‘మీలాంటి వాళ్లను రేప్ చేసినా అడిగే దిక్కులేదు..’ అంటూ బెదిరించారు. చిత్తూరు నగర టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దమయంతి లీలావతి, ఆమె కొడుకు అనూష్ చౌదరి చేసిన ఈ అరాచకాన్ని బుధవారం ఓ యువతి కన్నీటిపర్యంతమవుతూ సెల్ఫీ వీడియో ద్వారా బయటపెట్టింది. లీలావతి మోసాలపై బాధిత యువతి మాటల్లోనే..
ఆ వేధింపులు మాటల్లో చెప్పలేను..
‘‘హాయ్.. నా పేరు అనురూప. బెంగళూరులో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్న నేను మోసపోయిన విధానాన్ని ఈరోజు ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. నన్ను చిత్తూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు దమయంతి లీలావతి నెలకు రూ.25 వేలు వేతనం ఇప్పిస్తామంటూ తన బొటిక్ ఆకృతిలో పనిచేయాలని కోరారు. వసతి, భోజన సౌకర్యం ఇస్తామంటే వాళ్లను నమ్మి వచ్చేశాను. కానీ, అక్కడకు వచ్చిన తరువాత నాతో ఫ్యాషన్ డిజైన్‌తో పాటు వాళ్ల ఇంట్లో వంట పని, ఇల్లు శుభ్రంచేయడం బలవంతంగా చేయించారు.
నరకం అంటే ఎలా ఉంటుందో లీలావతి, ఆమె కొడుకు అనూష్ చౌదరి నాకు ప్రత్యక్షంగా చూపించారు. తినడానికి తిండి పెట్టలేదు. జీతం ఇవ్వలేదు. ఇలాంటి వాళ్లు ఈ బొటిక్‌లో చాలామంది ఉన్నారు. నా మాస్టర్లు ముగ్గురు ఉంటే వాళ్లను బలవంతంగా పంపించేశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భార్యకు వైద్యం చేయించుకోవాలని చెప్పినా మా మాస్టర్‌కు వేతనం ఇవ్వలేదు. నేను క్రియేటివిటీతో రూపొందించిన డిజైన్లతో ఓ ఫ్యాషన్ షో చేశారు. కనీసం నా పేరు వేయకుండా, నా కష్టాన్ని దోచుకున్నారు.
కామెర్లు వచ్చి బాధపడి, వైద్యానికి డబ్బుల్లేవని చెప్పినా నన్ను పట్టించుకోలేదు. ఎక్కడైనా వెళ్లి ఫిర్యాదు చేసుకో అన్నారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన మిమ్మల్ని రేప్ చేయించినా అడిగే దిక్కులేదు అని బెదిరించారు. ఎంతో కష్టపడి వారి చెర నుంచి తప్పించుకున్నాను. ఇలాంటి మోసాలకు ఎవ్వరూ గురికావద్దు. అధికారులు వీళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..’’ అంటూ యువతి కన్నీటిపర్యంతమైంది.

మహిళల ఆగ్రహం
ఈ ఘటనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. వీడియో బయటకొచ్చి ఎనిమిది గంటలైనా లీలావతి నిర్వహిస్తున్న బొటిక్‌పై పోలీసులు ఎందుకు దాడులు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నిస్తున్నారు. లీలావతి, ఆమె కొడుకును వెంటనే అరెస్టుచేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై విచారించి నివేదిక అందజేయాలని చిత్తూరు మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ శ్రీనివాసరావును ఎస్పీ తుషార్ డూడీ ఆదేశించారు.


