ఈ–చలాన్ల కుంభకోణంపై దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారు? | High Court bench reprimands police over traffic e challans case | Sakshi
Sakshi News home page

ఈ–చలాన్ల కుంభకోణంపై దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారు?

Aug 13 2026 2:30 AM | Updated on Aug 13 2026 2:30 AM

High Court bench reprimands police over traffic e challans case

పోలీసులను నిలదీసిన హైకోర్టు ధర్మాసనం 

పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశం

సాక్షి, అమరావతి: రేజర్‌ పే క్లోనింగ్‌ యాప్‌ సాయంతో రూ.36.53 కోట్ల ట్రాఫిక్‌ ఈ–చలాన్ల సొమ్మును దారి మళ్లించిన వ్యవహారంపై గతంలో నమోదు చేసిన కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పడంపై హైకోర్టు మండిపడింది. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్నించింది. తదుపరి చర్యల నిమిత్తం ఈ వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు పురోగతి, జాప్యానికి కారణాల వంటి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్‌ ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న ఈ వ్యవహారంపై తాడేపల్లి పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తును పక్కనపడేశారు. ఈ నేప­థ్యంలో గుంటూరుకు చెందిన క్రికెటర్‌ శిబి చక్రవర్తి హైకోర్టు­లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.  

జిల్లా జడ్జిలు బదిలీ
హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా గుత్తాల గోపి 
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో హైకోర్టులో పలు కీలక నియామకాలు చేపట్టింది. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)గా ఉన్న వైవీఎస్‌బీజీ పార్థసారథిని రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమించింది. కృష్ణా జిల్లా ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా ఉన్న గుత్తాల గోపీని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమించింది. విశాఖపట్నం ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా ఉన్న చిన్నంశెట్టి రాజును హైకోర్టు రిజిస్ట్రార్‌(అడ్మిన్‌)గా నియమించింది. 

అంతేకాక ఆయనకు కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రార్‌ (ఇన్‌ఫ్రా) బాధ్యతలను అదనంగా అప్పగించింది. నెల్లూరు ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి గోకవరపు శ్రీనివాస్‌ను విశాఖపట్నం ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా బదిలీ చేసింది. కడప ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి డాక్టర్‌ చదలవాడ యామినీని కృష్ణా జిల్లా ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా బదిలీ చేసింది. తిరుపతి ఫ్యామిలీ కోర్టు కం అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి గుడుగుంట రామగోపాల్‌ను కడప ప్రిన్సిపల్‌ జిల్లా సెషన్స్‌ జడ్జిగా నియమించింది. 

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసుల ప్రత్యేక కోర్టు జడ్జి అక్కిరెడ్డి నరసింహమూర్తి, నెల్లూరు ప్రిన్సిపల్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్‌ (అడ్మిన్‌)గా ఉన్న వీఎస్‌ఎస్‌ శ్రీనివాస శర్మను కృష్ణా జిల్లా మొదటి అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జిగా బదిలీ చేసింది. బదిలీ అయిన న్యాయాధికారులందరూ ఈ నెల 19వ తేదీలోపు కొత్త విధుల్లో చేరాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) వి.శ్రీనివాస శివరాం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement