సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ అయిఉంటే అది చాలా తీవ్రమైన వ్యవహారమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. మే నుంచీ హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదంటూ పోలీసులను ధర్మాసనం నిలదీసింది. తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
రెండు వారాలు గడువిస్తే కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరగా.. హైకోర్టు నిరాకరించింది. వారం రోజుల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ధర్మాసనం తేల్చి చెప్పింది. తదుపరి విచారణ ఈనెల 20వ తేదీకు కోర్టు వాయిదా వేసింది.
కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిల్‌పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.


