డీఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం | DSC irregularities must be answered says Botsa Satyanarayana | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

Aug 13 2026 2:26 AM | Updated on Aug 13 2026 2:26 AM

DSC irregularities must be answered says Botsa Satyanarayana

అవకతవకలపై సమాధానం చెప్పి తీరాల్సిందే 

అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలి, మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి 

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

సాక్షి,అమరావతి: ‘మెగా డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం సమగ్ర చర్చకు సిద్ధమా’ అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నిం­ంచారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఎమ్మె­ల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం మీడి­యాతో ఆయన మాట్లాడారు. డీఎస్సీపై మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అవకతవకలపై సమాధానం చెప్పడంతోపాటు మంత్రి లోకేశ్‌తో రాజీనామా చేయించి, డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

డీఎస్సీ పోస్టుల పేరుతో లక్షల్లో బేరసారాలు జరిగిన ఫోన్‌ సంభాషణలు బయటకొచ్చినా ఆ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నిం­ంచారు. ‘ఎవరు డబ్బు­లు అడిగారు. ఎవరితో మాట్లాడారు. ఎక్కడ బేరసారాలు జరిగాయన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డీఎస్సీ అవకతవకలపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. జీవోలు, కాల్‌ రికార్డింగులు, మెరిట్‌ లిస్టు జాబితాలు, తదితర అన్ని ఆధారాలతో ప్రభుత్వాన్ని శాసనమండలిలో నిలదీస్తాం. డీఎస్సీ విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకుండాపోతోంది. బేరసారాలకు సీఎం చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదు. అన్ని ఆరోపణలకు శాసనమండలిలో ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాల్సిందే’ అని డిమాండ్‌ చేశారు.   

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలి 
‘రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రైతు పెట్టుబడి పెట్టిన తర్వాత అకస్మాత్తుగా నీళ్లు ఇవ్వలేమని చెప్పడం సరికాదు. ముందుగానే పరిస్థితులను ప్రకటించి రైతులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో పంటల బీమా ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన పీపీపీ విధానం కూడా దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా లేదు. దానిపైనా ప్ర­భు­త్వం సమాధానం చెప్పాలి. ఉద్యోగులకు పీఆర్సీ లేదు. 

ఉద్యోగ సంఘాలు సమస్యలు చెప్పుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బలహీన వర్గాల నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టి లొంగదీసుకోవాలని ప్రభుత్వం చూస్తో­ంది. ఈ అంశాలన్నింటినీ శాసనమండలిలో ప్రస్తావించి ప్రభుత్వా­న్ని నిలదీస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందో ప్రభుత్వం చెప్పాలి. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, వెన్నుపోటు పార్టీ నాయకులకు మాత్రమే అభివృద్ధి కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలకు ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. 

వైఎస్సార్‌సీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. మేమే ప్రధాన ప్రతిపక్షం. అసెంబ్లీలో రెండు పక్షాలే ఉన్నాయి. కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. రాజ్యాంగబద్ధంగా మా హక్కుల కోసం పోరాడతాం. బెదిరింపులకు వైఎ­స్సా­ర్‌­సీపీ భయపడదు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా చంద్రబాబు వైఎస్సార్‌సీపీ, వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడానికే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలో పాలన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలి’ అని బొత్స సత్యనారాయణ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement