భారతి సిమెంట్స్‌పై చంద్రబాబు కుయుక్తులకు అంతేలేదా?
ఎమ్మెల్యేని, పచ్చ పటాలాన్ని ముందుపెట్టి నాటకాలా...
18 ఏళ్లుగా ప్రాజెక్టు నడుస్తుంటే సమస్యలంటూ ఇప్పుడు మాట్లాడతారా..
ఆ ప్రాంత ప్రజలకు ఎంత మేలు చేసి ఉంటే గుండెల్లో పెట్టుకుంటారు..
భూమికి పరిహారం చెల్లించేసి.. మరలా రైతులకు అదనంగా డబ్బు ఇచ్చిన జగన్
ప్రాజెక్టు ఇంత విజయవంతంగా నడవడానికి ప్రజల ప్రేమాభిమానాలే కారణం కాదా..
నాలుగేళ్ల క్రితం కేసుపై ఇప్పుడు రాద్ధాంతమా..
అందులో సాక్ష్యాలతో సహా దొరికిపోయి లేబర్ కోర్టులో ఓడిపోయారు..
భారతి సిమెంట్స్ అనుబంధ వికాట్ గ్రూప్ దేశంలోనే బెస్ట్ సిమెంట్ కంపెనీల్లో ఒకటి..
చంద్రబాబు అండ్‌కో వేధింపుల వల్లే రెండేళ్లలో 7 కంపెనీలు రాష్ట్రం నుంచి పారిపోయాయి..
ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం అంటూ చంద్రబాబు స్వోత్కర్షలే..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ 1 నుంచి 8వ స్థానానికి పతనం
సాక్షి, అమరావతి: తప్పు అంటూ సాక్షాత్తూ హైకోర్టు తీవ్రంగా మందలించింది.. మంచి పద్ధతి కాదంటూ మొట్టికాయలేసింది. కరువు సీమలో ఉపాధి కల్పిస్తూ..చట్టబద్ధంగా అన్ని అనుమతులతో కార్యకలాపాలు నడుపుతూ ప్రభుత్వానికి వేల కోట్ల పన్నులు చెల్లిస్తున్న ప్రతిష్టాత్మక సిమెంట్ కంపెనీ భారతి సిమెంట్స్‌ను అడ్డుకోవడం తగదని హైకోర్టు హితవు పలికింది. అయినా చంద్రబాబు అండ్ కో తీరు మారలేదు. కోర్టు తీర్పుతో కూడా మార్పు రాలేదు. ఇప్పటికీ తప్పు సరిదిద్దుకోవాలన్న తలంపు లేదు.
కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో తాను అబద్దాలు ఆడినట్లే తమ పార్టీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డితో కూడా చంద్రబాబు అబద్ధా్దలు చెప్పిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం కేసుపై రాద్ధాంతం చేయిస్తున్నారు.. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి లేబర్ కోర్టులో ఓడిపోయిన ఆ కేసుపై ఇప్పుడు నాటకాలేమిటని కార్మికులే ఆశ్చర్యపోతున్నారు.. మైనింగ్ ఇబ్బందికరంగా మారిందని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని టీడీపీ నేతలు కట్టుకథలు అల్లుతున్నారు. ఇవన్నీ డ్రామాలేనని ప్రజలకు అర్థమవుతూనే ఉంది...
ప్రజలు గుండెల్లో పెట్టుకున్న కంపెనీ..
భారతి సిమెంట్స్ సంస్థ 18 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. అక్కడి ప్రజల సహకారం, అభిమానం లేకపోతే ఒక కంపెనీ ఇంతకాలం ఇంత విజయవంతంగా నడవడం సాధ్యమయ్యే పనేనా? హైకోర్టు చెప్పినట్లు.. కరువు ప్రాంతంలో వచ్చిన ఈ కంపెనీ అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 15 వేల కుటుంబాలలో వెలుగులు నింపింది. అందుకే ప్రజలు ఈ కంపెనీని గుండెల్లో పెట్టుకున్నారు. భారతి సిమెంట్స్ కంపెనీ పట్ల ప్రజల అవ్యాజమైన అభిమానానికి మరో కారణం కూడా ఉంది.
సాధారణంగా పరిశ్రమల కోసం భూమి సేకరిస్తే పరిహారం ఇవ్వడంతోనే.. రైతులకు, పారిశ్రామికవేత్తలకు అక్కడితో సంబంధం ముగిసిపోతుంది. కానీ పేదల కష్టాల గురించి తెలిసిన.. అందరికీ చేతనైనంత సాయం చేయాలని అహరహం తపించే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విభిన్నంగా ఆలోచించారు. భారతి సిమెంట్స్ కోసం భూములిచ్చిన రైతులందరికీ మరలా ఎకరానికింత అని లెక్కగట్టి అదనంగా డబ్బులిచ్చారు. ఒక రేటు కట్టి భూమికి డబ్బు ఇచ్చేసిన తర్వాత మరలా డబ్బు ఇచ్చిన పారిశ్రామికవేత్త బహుశా ఎవరూ ఉండరేమో.. ప్రజలంటే జగన్‌కు ఎంత అభిమానమో..జగన్ పట్ల ఆ ప్రాంత ప్రజల్లో కూడా అంత గుడ్‌విల్ ఉంది. అందుకే జగన్‌ను, భారతి సిమెంట్స్ సంస్థను అక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి సంస్థపై అభాండాలు వేస్తే ఎవరైనా నమ్ముతారా....
వీగిపోయిన అబద్ధపు కేసుతో ఏం సాధిస్తారు?
ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పచ్చ ముఠాల ప్రోద్బలంతో 10మంది వర్కర్లు అప్పటి సీఈవోపై దాడి చేశారు. ఆ కేసులో సీసీటీవీ ఫుటేజి సహా అన్ని సాక్ష్యాధారాలూ స్పష్టంగా ఉన్నాయి. దానిపైన లేబర్ కోర్టులో వేసిన కేసులో ఓడిపోయారు కూడా.. కొందరు కార్మికులను ఉసిగొల్పి దాడిచేయించి ఆ తర్వాత కేసుపెట్టి ఏదో సాధించాలనుకున్న వారు అలా దెబ్బతిన్నారు.. మరలా ఇప్పుడు ఆ కేసునే పట్టుకుని అదే కార్మికులను ముందుపెట్టి వాళ్లను రెచ్చగొడుతూ గొడవ నడిపిస్తున్నారు. ఇది చాలదన్నట్లు మైనింగ్ చేస్తుంటే శబ్దాలు వస్తున్నాయంటూ కొత్త కట్టుకథలు మొదలుపెట్టారు. 18 ఏళ్లుగా లేని సమస్యలు ఇపుడు కొత్తగా వచ్చాయా? మీరెన్ని అబద్ధాలు ప్రచారం చేయాలనుకున్నా స్థానికులకు వాస్తవాలు తెలియవా..? ఇవన్నీ డ్రామాలేనని అర్ధం
కావడం లేదూ..?
పెట్టుబడిదారులకు స్వర్గధామమా..?
భారతి సిమెంట్స్, భారత్‌లో రూ.7 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ సంస్థ వికాట్ గ్రూప్‌పై చంద్రబాబు సర్కార్ పగబట్టినట్లు వ్యవహరిస్తుండడంపై పారిశ్రామిక వేత్తలు ఆశ్చర్యపోతున్నారు. దేశంలోని బెస్ట్ సిమెంట్ కంపెనీలలో ఒకటైన వికాట్ గ్రూప్‌తో అనుబంధమున్న భారతి సిమెంట్స్ వంటి సంస్థ కార్యకలాపాలనే ఇలా కక్షసాధింపుతో అడ్డుకుంటుంటే... రాష్ట్రంపై అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందన్న ఆందోళన పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. చట్టబద్దమైన వ్యాపార సంస్థలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఇలా కక్షసాధించడం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్యాక్స్ రూపంలో రూ.7,300 కోట్లు చెల్లిస్తున్న భారతి సిమెంట్స్, వికాట్ వంటి సంస్థలను అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనమేమిటి అని పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు. వైజాగ్‌లో గ్రైండింగ్ స్టేషన్ పెట్టాలని నిర్ణయించుకున్నా వికాట్ సంస్థ ఇదే కారణంతో ఆ ఆలోచనను ఉపసంహరించుకుందని వారు గుర్తుచేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత ప్రభుత్వ హయాంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 8వ స్థానానికి పడిపోయింది.
పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని చెబుతున్న చంద్రబాబు చేస్తున్నదేమిటి? ఎమ్మెల్యేలను ముందుపెట్టి వారిని వేధింపులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు అండ్ కో తీరు వల్లే రాష్ట్రం నుంచి పలు కంపెనీలు పలాయనం చిత్తగిస్తున్నాయి. తాజాగా టాటా గ్రూప్ కంపెనీ బైబై చెప్పేసింది.. హిందుస్థాన్ కోకోకోలా, ఆజాద్ మొబిలిటీ, జూపిటర్, జిన్‌ఫ్రా, ఐస్పేస్ లాంటి సంస్థలు కూడా వెళ్లిపోయాయి.


