డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు సర్కారు హుకుం
ఈనెల 16న విజయవాడలో డీఎస్సీ–2025 ఉపాధ్యాయులతో సభ
డీఎస్సీలో అక్రమాలు జరగలేదని వారితో చెప్పించాలని ప్రయత్నం
ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఉపాధ్యాయులను తరలించేందుకు సన్నాహాలు
గుంటూరు జిల్లాలో ఎంఈవోలకు బాధ్యతలు అప్పగిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పిల్లలకు పాఠాలు సక్రమంగా చెప్పాలనో.. విధులకు సమయానికి హాజరు కావాలనో.. విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను మంచి ప్రయోజకులను చేయాలనో.. ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలలకు పోటీగా తీర్చిదిద్దాలనో చెప్పాల్సిన ప్రభుత్వం దాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షంపై పోరాటం చేసేందుకు రావాలంటూ ఉపాధ్యాయులకు హుకుం జారీ చేస్తోంది. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకు మద్దతు పలకాలంటూ బలవంతం చేస్తోంది. ఇందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. డీఎస్సీలో ఉద్యోగాలు సంపాదించిన వారిపై విద్యాశాఖ అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ను గట్టెక్కించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ పోరాటంతో ఉక్కిరిబిక్కిరి..
డీఎస్సీ–2025 క్రీడా కోటా నియామకాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటంతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రభుత్వ పెద్దలు డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగుతున్నారు. డీఎస్సీ క్రీడల కోటా పోస్టింగ్స్‌లో అక్రమాలపై సాక్ష్యాధారాలతో ప్రజల ముందు ఉంచిన వైఎస్సార్‌సీపీకి సమాధానం చెప్పలేక, మంత్రి లోకేశ్‌తో రాజీనామా చేయించలేక.. చంద్రబాబు డీఎస్సీలో అక్రమాలు జరగలేదని అభ్యర్థులతో చెప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఈనెల 16న విజయవాడలో డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయ కొలువులను పొందినవారితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి డీఎస్సీ ఉపాధ్యాయులను బస్సుల్లో విజయవాడకు తరలించే బాధ్యతలను టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు అప్పగించారు. దీంతో మంగళవారం గుంటూరులోని ఆర్జేడీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్.. ఆర్జేడీ లింగేశ్వరరెడ్డితో చర్చించారు. డీఎస్సీ–2025 క్రీడల కోటాలో జరిగిన అవినీతి, అక్రమాలపైనే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుండగా, దీన్ని వక్రీకరించే కుట్రకు కూటమి ప్రభుత్వం తెరతీసింది.
ఆదివారం డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులను బస్సుల్లో విజయవాడకు తరలించేందుకు ఆర్జేడీతో పాటు డీఈవోలకు బాధ్యతలు అప్పగించారు. దీంతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని ఎంఈవోలను తమ కార్యాలయాలకు పిలిపించుకుని, మండలాల వారీగా డీఎస్సీ–2025 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులందరినీ సభకు తీసుకురావాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. లోకేశ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్వయంగా ఉపాధ్యాయులతో అక్రమాలే జరగలేదని చెప్పించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.


