టార్గెట్‌ వైఎస్సార్‌సీపీ.. సోషల్‌ మీడియా కట్టడి! | Monthly performance reports on illegal case registration | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ వైఎస్సార్‌సీపీ.. సోషల్‌ మీడియా కట్టడి!

Aug 13 2026 2:49 AM | Updated on Aug 13 2026 2:49 AM

Monthly performance reports on illegal case registration

రెడ్‌బుక్‌ మరింత బరితెగింపు 

అడ్డగోలుగా అక్రమ కేసులకు పచ్చజెండా 

ప్రభుత్వ వైఫల్యాలపై ర్యాలీలు, పరామర్శలు, యాత్రలను కట్టడి చేసే ఎత్తుగడ 

పోలీసులతో సీఎం వర్చువల్‌ భేటీలో కీలక ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుతూ.. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతూ.. అక్రమ కేసులతో విరుచుకుపడుతున్న చంద్రబాబు సర్కారు తాజాగా మరింత బరి తెగించింది! నిరసన గళాలపై అడ్డగోలుగా అక్రమ కేసులు బుక్‌ చేసేందుకు పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు చేపట్టే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టడి చేసి తీరాలని పోలీసులను ఆదేశించింది. అక్రమ కేసుల నమోదులో ప్రతి నెలా మీ ఫెర్ఫార్మెన్స్‌ రిపోర్టులు పరిశీలిస్తామంటూ రెడ్‌బుక్‌ పోలీసులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది! 

మెగా డీఎస్సీ 2025 స్కామ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని, సీబీఐతో విచారించాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ప్రజాక్షేత్రంలోకి పెద్ద ఎత్తున వెళ్లడం.. జెన్‌ జీ యువత, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు నిరసన ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొనడంతో టీడీపీ పెద్దలు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుండటంతో కుట్రలకు మరింత పదును పెట్టి పోలీసులను పురిగొల్పుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

వేల మందితో వర్చువల్‌ భేటీ.. 
వైఎస్సార్‌సీపీ టార్గెట్‌గా.. సోషల్‌ మీడియా కట్టడే లక్ష్యంగా రెడ్‌బుక్‌ అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా పచ్చ జెండా ఊపారు! ఈమేరకు ఎన్నడూ లేనివిధంగా అమరావతిలోని సచివాలయం వేదికగా బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 1,200కిపైగా పోలీస్‌ స్టేషన్‌లకు చెందిన 1,632 మంది హౌస్‌ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ) వర్చువల్‌గా సమావేశంలో పాల్గొనడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2.40 గంటలపాటు ఈ సమీక్ష నిర్వహించగా ఇందులో గంటన్నరకుపైగా సీఎం మాట్లాడటం గమనార్హం. 

ర్యాలీలు, పరామర్శలు, యాత్రలను కట్టడి చేయాలి అంటూ..
ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియాను అణచివేసేలా వర్చువల్‌ భేటీలో ప్రభుత్వ పెద్దలు పోలీసులకు పరోక్షంగా డైరెక్షన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని, డీజీ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్‌ వరకూ పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అయితే కేసుల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి నెలా మీ ఫెర్ఫార్మెన్స్‌ రిపోర్టులు పరిశీలిస్తామంటూ వారికి టార్గెట్స్‌ ఫిక్స్‌ చేశారు. ప్రధానంగా ర్యాలీలు, పరామర్శలు, యాత్రలను కట్టడి చేయాలంటూ పరోక్షంగా వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని డైరెక్షన్‌ ఇవ్వడం గమనార్హం. 

రోడ్లపై విన్యాసాలు చేసేందుకు అవకాశం ఇవ్వొద్దని గట్టిగా సూచించారు. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే కార్యక్రమాలను అదుపు చేయాలని పోలీసులకు సంకేతాలు ఇచ్చారు. రాజకీయ పార్టీలకు ఇష్టానుసారం వ్యవహరించే లైసెన్సు ఇవ్వలేదని వ్యాఖ్యానించిన సీఎం.. ప్రస్తుతం రోడ్లపైకి వస్తున్న వారిలో 94 శాతం మంది ఒక పార్టీ నుంచే ఉంటున్నారంటూ వైఎస్సార్‌సీపీపై అసహనం వెలిబుచ్చారు. పోలీసులపై కోర్టులో ప్రైవేట్‌ కేసులు వేస్తారని, అందుకు మీరేం భయపడొద్దని, ప్రభుత్వమే న్యాయ సహాయం అందిస్తుందని సీఎం చెప్పడం అంటే.. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరించాలని మరింత రెచ్చగొట్టినట్టేనని పలువురు తప్పుబడుతున్నారు.

ఏ పనైనా చేస్తామన్న వీర విధేయ అధికారులు..! 
సీఎం అంతరంగాన్ని అర్థం చేసుకున్న టీడీపీకి అత్యంత విధేయుడైన ఓ ఐపీఎస్, మరో ఇద్దరు అధికారులు.. మీరు మాకు అండగా ఉంటే ఏ పని చెప్పినా చేస్తామంటూ అత్యుత్సాహంగా స్పందించడం పోలీసు వర్గాల్లో ఆంతరంగిక చర్చ­కు దారితీసింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, శాంతి భద్రతల అదనపు డీజీ ఎన్‌.మధుసూదనరెడ్డి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేష్‌ చంద్ర లడ్హా, ఈగల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఐజీ రవికృష్ణ, ఇతర ఉన్నతాధికారులు, రేంజ్‌ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement