72% పనులకు రూ.363.68 కోట్లు
28% పనులకు రూ.524.70 కోట్లా?
ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ల క్వార్టర్స్ నిర్మాణ పనుల్లో చంద్రబాబు సర్కార్ మాయాజాలం
అమరావతిలో 18 టవర్లలో 432 ప్లాట్లు నిర్మాణం
2017లో రూ.635.90 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు అప్పగింత
2019కే రూ.363.68 కోట్లతో 72% పనులు పూర్తి: కాగ్
మిగిలిన 28% పనుల వ్యయం రూ.272.22 కోట్లుగా నిర్ధారణ
కానీ అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేసిన బాబు సర్కార్
ఆ పనులను పరిపాలన అనుమతి లేకుండానే ఎన్‌సీసీకి కట్టబెట్టిన వైనం
అంటే అంచనా వ్యయం ఒకేసారి రూ.252.48 కోట్లు పెంచేశారు
స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి ధరల్లో వ్యత్యాసం లేదు.. పైగా ఇసుక ఉచితం.. అయినా వంద శాతం అంచనా వ్యయం పెంచేయడంపై సర్వత్రా విస్మయం
సాక్షి, అమరావతి: రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు క్వార్టర్స్ కోసం ఎస్+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ప్లాట్లు (యూనిట్లు) నిర్మాణ పనులు 2019 నాటికే 72 శాతం పూర్తయ్యాయి.. ఆ పనులకు రూ.363.68 కోట్లు బిల్లులు చెల్లించారు. మిగిలిన 28 శాతం పనుల వ్యయం రూ.272.22 కోట్లు. కానీ... ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేసి 2017లో వాటిని అప్పగించిన ఎన్‌సీసీ సంస్థకే మళ్లీ ఇప్పుడు కట్టబెట్టారు. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.252.48 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది.
2018–19 నాటితో పోల్చితే ఇప్పుడు స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 92.75 శాతం పెంచేయడంపై ఇంజినీర్లు నివ్వెరపోతున్నారు. పెంచేసిన అంచనా వ్యయం మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్లిందన్నది బిగ్‌బాస్‌కే ఎరుక. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి ఇది మరో నిదర్శనమని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేల కోసం 6 టవర్లు, ఎమ్మెల్సీల కోసం 3 టవర్లలో పూర్తయిన 207 ప్లాట్లను నేడు (గురువారం) సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు.
2017లో రూ.635.90 కోట్లకు అప్పగింత..
రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం ఎస్+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ప్లాట్ల నిర్మాణ పనులకు 2017లో రూ.608 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండరు పిలిచింది. 4.59 శాతం అధిక ధరలకు కోట్ చేసి రూ.635.90 కోట్లకు ఆ పనులను ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. వాటిని ఎన్‌సీసీకి అప్పగిస్తూ 2017, నవంబర్ 13న సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఈ పనులు 2019, ఫిబ్రవరి 12 నాటికి పూర్తి కావాలి. ఆ పనులు 2019 నాటికి 72 శాతం పూర్తయినట్లు.. వాటికి రూ.363.68 కోట్ల వ్యయం చేసినట్లు 2023లో కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చింది. అంటే.. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయం రూ.272.22 కోట్లు.
రద్దు చేసి.. అంచనా వ్యయాన్ని పెంచేసి..
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేశారు. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయాన్ని రూ.272.22 కోట్ల నుంచి రూ.524.70 కోట్లకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలిచి.. ఎన్‌సీసీ సంస్థకే అప్పగించారు. అంటే.. నాడూ నేడూ వాటిని టెండర్ ద్వారా ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారన్నది స్పష్టమవుతోంది. సాంకేతికంగా చూస్తే.. 2017లో ఆ పనులను దక్కించుకున్న సంస్థే 2025లో వాటిని మళ్లీ దక్కించుకోవడం సాధ్యం కాదు. టెండర్ నోటిఫికేషన్ జారీ చేయక ముందే సిండికేట్ కాంట్రాక్టర్లకు బిగ్‌బాస్ దిశానిర్దేశం చేసి.. సీఆర్‌డీఏ అధికారులకు కనుసైగ చేయడం వల్లే పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను మళ్లీ ఎన్‌సీసీకే కట్టబెట్టారని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న క్వార్టర్‌ల పనులు 2019 నాటికి రూ.363.68 కోట్లతో 72 శాతం పూర్తయినట్లు తేల్చిన కాగ్ నివేదిక

మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేస్తూ గత ఏడాది జూలై 13న చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు
పరిపాలన అనుమతి లేకుండానే..
అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేస్తూ చేపట్టిన పనులను పరిపాలన అనుమతి లేకుండానే సీఆర్‌డీఏ అధికారులు గతేడాది ఏప్రిల్ 28న ఎన్‌సీసీ సంస్థకు కట్టబెట్టేస్తూ ఒప్పందం చేసుకున్నారు. కాంట్రాక్టు అగ్రిమెంట్ విలువలో పది శాతం (ఐదు శాతం మెషినరీ, ఐదు శాతం లేబర్) మొబిలైజేషన్ అడ్వాన్సు కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మేరకు ఎన్‌సీసీ సంస్థకు మెషినరీ విభాగం కింద 5 శాతం అంటే రూ.26.68 కోట్లను చెల్లించాలని సీఎఫ్‌ఎంస్ (కాంప్రహెన్షివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ద్వారా పీఏవో (పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్)కు సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదన పంపారు. పరిపాలన అనుమతి లేకుండా ఆ పనిని చేపట్టిన నేపథ్యంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లించలేమంటూ పీఏవో దానిని సీఆర్‌డీఏ అధికారులకు తిప్పి పంపారు. దాంతో సీఆర్‌డీఏ అధికారులు చేసుకున్న ఒప్పందాన్ని కేబినెట్‌లో ఆమోదింపజేసి.. గతేడాది జూలై 13న ఆ పనులకు పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయించడం గమనార్హం.
రూ.456.38 కోట్లకుపైగా దోపిడీ..
రాజధానిలో ప్రభుత్వం సీఆర్‌డీఏ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారులకు నిర్మిస్తున్న తరహాలోనే హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతంలో ఇటాలియన్ మార్బుల్స్‌తో అత్యాధునిక హంగులతో నిర్మించిన ప్లాట్ల ధర ఒక్కొక్కటి రూ.కోటికి మించదని ఇంజినీర్లు, రియల్టర్లు, బిల్డర్లు గుర్తు చేస్తున్నారు. అది కూడా భూమి విలువతో కలిపి.
కానీ.. సీఆర్‌డీఏ పరిధిలో భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా సరే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ కోసం నిర్మిస్తున్న 432 ప్లాట్ల అంచనా వ్యయం రూ.888.38 కోట్లు(2019 నాటికి చేసిన వ్యయం రూ.363.68 కోట్లు+ఇప్పుడు అప్పగించిన మిగిలిన పనుల వ్యయం రూ.524.70 ఓట్లు)కు చేరుకుంది. అంటే.. ఒక్కో ప్లాట్ నిర్మాణ వ్యయం రూ.2.06 కోట్లు. అంటే.. ఒక్కో ప్లాట్‌పై రూ.1.06 కోట్ల చొప్పున అధికంగా వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. వీటిని బట్టి చూస్తే ఈ ప్లాట్ల నిర్మాణంలో రూ.456.38 కోట్లకుపైగా దోపిడీ చేస్తున్నారని ఇంజినీరింగ్ నిపుణులు, బిల్డర్లు చెబుతున్నారు.


