సాక్షి, సూర్యాపేట: మోతె మండల కేంద్రంలో దంపతుల హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ షరీఫ్‌తో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు బూబాతో షరీఫ్‌కు వివాహేతర సంబంధం కొనసాగుతుండగా.. మరో మహిళతోనూ షరీఫ్‌కు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో మరో మహిళతో సంబంధంపై షరీఫ్‌ను బూబా నిలదీసింది. కొంతకాలంగా బూబా, షరీఫ్ మధ్య గొడవ జరుగుతుంది.
ఓ నిర్మానుష్య ప్రాంతానికి షరీఫ్‌తో పాటు బూబా వెళ్లింది. మాటామాటా పెరిగి బూబాను షరీఫ్ హత్య చేశాడు. బూబాను హత్య చేసేందుకు షరీఫ్‌కు సుందరయ్య సహకరించాడు. అదే సమయంలో విషయం తెలుసుకుని ఘటనాస్థలికి వెళ్లిన బూబా భర్తను సైతం కొట్టి చంపిన కానిస్టేబుల్ షరీఫ్.. హత్యానంతరం దంపతుల డెడ్‌బాడీలను పాతిపెట్టాడు.
దంపతులను హత్య చేసిన తర్వాత మోతె నుంచి సూర్యాపేట వెళ్లిపోయిన కానిస్టేబుల్ షరీఫ్.. బుధవారం యథావిధిగా విధులకు హాజరయ్యాడు. ఘటనా స్థలంలో మృతదేహాలను వెలికితీసే సమయంలో అక్కడే విధుల్లో పాల్గొన్న షరీఫ్.. తనకేం తెలియదన్నట్లు అమాయకంగా ప్రవర్తించారు. స్థానికులు.. ఘటనా స్థలంలోకి వస్తున్న సమయంలో ఆధారాలు చెదిరిపోతాయంటూ అరుస్తూ షరీఫ్ ఏమీ తెలియనట్టు నటించాడు.
అయితే, ఈ కేసులో సీసీ ఫుటేజ్ నిందితులను పట్టించింది. సుందరయ్య గుంతను పూడ్చేందుకు పార తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సుందరయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనే ఓసారి బూబా హత్యకు షరీఫ్ ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. షరీఫ్ చంపిన బూబా వయస్సు 42 సంవత్సరాలు కాగా, హత్య చేసిన కానిస్టేబుల్ షరీఫ్ వయస్సు 26 సంవత్సరాలు.


