కార్పొరేషన్ పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారన్న దానిపై అధికార పార్టీలో కొరవడిన స్పష్టత
సీఎం విదేశీ పర్యటనకు ముందా... ఆ తర్వాతేనా అన్న చర్చ
ఒక్కో ఉమ్మడి జిల్లాకు 20 మందికి తగ్గకుండా ఆశావహులు
ఢిల్లీలో తెలంగాణ నేతల భేటీల తర్వాత గాంధీభవన్ వర్గాల్లో కొత్త చర్చ
సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడనేది అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా గత నెలలో పదవీకాలం పూర్తయిన కార్పొరేషన్ చైర్మన్లు, ఇప్పటి వరకు భర్తీ చేయని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎప్పుడు ప్రకటిస్తారనే విషయంలో కంగాళీ ఏర్పడింది. అసలు ఈ పోస్టుల భర్తీ ఉంటుందా ? ఉంటే ఎప్పుడు? ప్రాతిపదికలేమిటి? గతంలో పనిచేసిన వారికి మళ్లీ అవకాశమిస్తారా? పూర్తిగా కొత్త వారిని నియమిస్తారా? తదితర ప్రశ్నలు కాంగ్రెస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశాల అనంతరం ఆగస్టులో పార్టీ పదవులు భర్తీ చేసి, సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించినా, ఆశావహుల్లో మాత్రం సందేహాలు వెంటాడుతూనే ఉన్నాయి. అసలు ఇప్పట్లో కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేసేది లేదని ఓ ముఖ్య నేత ఇటీవల బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఈ కంగాళీకి కారణమవుతోంది. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 19నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈలోపే కొన్ని నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తారనే చర్చ ఆశావహులకు కొంత ఊరటనిస్తున్నా అది జరుగుతుందా లేదా అనే మీమాంస మాత్రం వారిని వెంటాడుతుండడం గమనార్హం.
పెద్ద ఎత్తున ఆశావహులు
అవకాశం ఎదురుచూస్తున్న వారి జాబితా చాంతాడంత కనిపిస్తోంది. కొత్తగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న నేతలే ఉమ్మడి జిల్లాకు ఓ 20 మందికి తగ్గకుండా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పిడమర్తి రవి, నాగా సీతారాములు, సాధు రమేశ్‌రెడ్డి, వక్కలగడ్డ చంద్రశేఖర్, కమర్థపు మురళి (ఖమ్మం), గౌరి సతీష్, అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ (రంగారెడ్డి), సీఎన్‌రెడ్డి, పల్లె లక్ష్మణ్‌కుమార్, బొల్లు కిషన్ (హైదరాబాద్), కొక్కిరాల విశ్వప్రసాద్ , దుర్గం భాస్కర్, రేఖానాయక్, పురాణం సతీశ్‌కుమార్ (ఆదిలాబాద్), వినయ్‌రెడ్డి, మార చంద్రమోహన్‌రెడ్డి, ఏబీ శ్రీనివాస్, మునిపల్లి సాయారెడ్డి, అరికెల నర్సారెడ్డి (నిజామాబాద్), కర్ల సత్యప్రసన్నరెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఊట్కూరు నరేందర్‌రెడ్డి (కరీంనగర్), పున్నా కైలాష్ నేత, కొండేటి మల్లయ్య, గుమ్ముల మోహన్‌రెడ్డి, లక్ష్మి నారాయణరెడ్డి, చనగాని దయాకర్ (నల్లగొండ), ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, ఈవీ శ్రీనివాస్, ఐత ప్రకాశ్‌రెడ్డి, కొనగాల మహేశ్ (కరీంనగర్)ల పేర్లు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన వారు కలిపి ప్రతి జిల్లాలో 20 మందికి తగ్గకుండా ఆశావహులు కనిపిస్తున్నారు.
ఎవరి మాట నెగ్గుతుందో..?
ఇటీవల ఢిల్లీలో జరిగిన తెలంగాణ ముఖ్య నేతల భేటీ అనంతరం గాం«దీభవన్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. గతంలో నామినేటెడ్ పదవులతో సహా ఎలాంటి కీలక విషయంలోనైనా సీఎం, టీపీసీసీ చీఫ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జులు నిర్ణయం తీసుకునే ఆనవాయితీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే, ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో టీపీసీసీ సమన్వయ కమిటీలో చర్చించిన తర్వాతే పదవుల భర్తీపై తుది నిర్ణయానికి రావాలని రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అధిష్టానం స్పష్టం చేసిందని తెలుస్తోంది.
మరో విశేషమేమిటంటే... హస్తినలో భేటీలు ముగిసిన అనంతరం రాష్ట్రానికి వచ్చిన పార్టీ నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని, గతంలో లాగా రాజకీయ చర్చలు జరగడం లేదన్న చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతుండడం నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో మరింత గుబులు రేపుతోంది.


