మళ్లీ మొదటి నుంచి వాదనలు విననున్న సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన విచారణను రద్దు చేసి, మళ్లీ మొదటి నుంచి వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చాయి.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. గతంలో ఈ కేసు వాదనలు పాక్షికంగా జరిగాయని వారు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ధర్మాసనం స్పందిస్తూ.. గతంలో ఈ కేసు విచారణ చేపట్టిన బెంచ్‌లోని ఒక న్యాయమూర్తి ఇప్పటికే పదవీ విరమణ చేసినందున, కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాల్సి ఉందని స్పష్టం చేసింది. తదుపరి వాదనలు వినేందుకు విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.


