ప్రజలపై చేతబడులా? | CM Revanth Reddy at foundation stone laying ceremony of Indiramma Towers | Sakshi
Sakshi News home page

ప్రజలపై చేతబడులా?

Aug 14 2026 1:36 AM | Updated on Aug 14 2026 1:36 AM

CM Revanth Reddy at foundation stone laying ceremony of Indiramma Towers

సీఎం రేవంత్‌రెడ్డికి ఇందిరమ్మ టవర్స్‌ లేఔట్‌ గురించి వివరిస్తున్న హౌసింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్‌. చిత్రంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

అవి తిరగబడితే ఫామ్‌హౌస్‌ల్లో అష్టదిగ్బంధనమే

ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

పదేళ్లు అధికారంలో ఉన్నవారు ప్రభుత్వం, ప్రజలపై అఘోరా పూజలు చేయించడం దుర్మార్గం 

రాష్ట్రంలో కరువొచ్చి జనాలు అల్లాడిపోవాలని, ప్రభుత్వం బద్నాం కావాలని చేతబడులు చేశారు 

ఎంత ఘోరమైన పూజలు చేసినా దేవుడు, అదృష్టం మా వైపే.. 

మా సంకల్పం మంచిది కాబట్టే ఎల్‌నినో సమయంలోనూ వర్షాలు 

అత్యంత విలువైన స్థలంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు 

కొనుక్కున్న భూమి 22ఏ జాబితాలో ఉన్నా అంగుళం కూడా పోదన్న సీఎం

సాక్షి, హైదరాబాద్‌: ‘పదేళ్లు అధికారంలో ఉన్న వారు, పాతికేళ్లు తెలంగాణలో రాజకీయం చేసినవారు ప్రభుత్వం, ప్రజలపై పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు, అఘోరా పూజలు చేయించడం అత్యంత దుర్మార్గం. బుద్ధి సరిగ్గా లేకపోతే ఆ క్షుద్ర పూజలే తిరగబడతాయి. అదే గనుక జరిగితే మిమ్మల్ని ఫామ్‌హౌస్‌ల నుంచి బయటికి రాకుండా అష్ట దిగ్బంధనం చేస్తాయి..’ అని సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. గురువారం కూకట్‌పల్లిలో తొలి ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని, కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని, ప్రభుత్వం బద్నాం కావాలని ప్రతిపక్ష నాయకులు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అఘోరా పూజలు, చేతబడులు చేశారు. ఎంత ఘోరమైన పూజలు చేసినా దేవుడు, అదృష్టం మా వైపే ఉన్నాయి. మా సంకల్పం మంచిది కాబట్టే ఎల్‌ నినో సమయంలోనూ వర్షాలు కురిసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌లు నిండాయి. హైదరాబాద్‌కు తాగునీటి ఎద్దడి లేకుండా పోయింది. చిత్తశుద్ధి, మంచి ఆలోచన ఉన్న మా ప్రభుత్వాన్ని ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ ఎల్లప్పుడూ కాపాడతాయి..’ అని సీఎం అన్నారు. 

రిజిస్ట్రేషన్‌ చార్జీలు రద్దు 
‘గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో పేదలను ఊరించి, నగరం నుంచి 40–50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు, మేడ్చల్‌ లాంటి ప్రాంతాల్లో కట్టి ఇబ్బందులకు గురిచేసింది. నగరంలో పనిచేసుకునే పేదలు అర్ధరాత్రి వేళ అంత దూరం వెళ్లి ఎలా జీవిస్తారు? అందుకే కూకట్‌పల్లిలో రూ.వందల కోట్ల విలువైన 11 ఎకరాల స్థలాన్ని కేటాయించి, పేదలు నివసించే ప్రాంతంలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఐటీ కంపెనీల నడుమ, శిల్పారామం పక్కన రూ.1,000 కోట్ల విలువైన 3.5 ఎకరాల స్థలాన్ని ’ఇందిరమ్మ మహిళా శక్తి’ స్టాళ్లకు కేటాయించి, మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను, పిండి వంటలను విక్రయించుకునేలా అమెజాన్‌ లాంటి ఈ–కామర్స్‌ సంస్థలతో సైతం అనుసంధానం చేశాం. పేదల కోసం నిర్మించే ఇళ్లకు సంబంధించి స్థలాన్ని పూర్తి ఉచితంగా ఇస్తున్నాం. పేదల ఇళ్లకయ్యే రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా రద్దు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, ఉప్పల్‌ లాంటి ప్రాంతాల్లో ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న పేదలకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం..’ అని రేవంత్‌ చెప్పారు.  

22ఏ భూములపై ఆందోళన వద్దు 
‘నిషేధిత జాబితా (22 ఏ)ల్లో ఉన్న భూములకు సంబంధించి హక్కుదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 22 ఏలో చేరిన భూముల సర్వే నంబర్లకు బై నంబర్లు ఇచ్చి హక్కుదారుల సమస్యలను పరిష్కరిస్తాం. కొనుగోలు చేసిన హక్కుదారుల స్థలం అంగుళం కూడా ఎక్కడికీ పోదు. కోర్టు కేసులున్న స్థలాల వరకు పక్కనపెట్టి మిగతా వాటికి బై నంబర్లు ఇచ్చి సమస్య పరిష్కరిస్తాం. భూములు, కట్టుకున్న ఇళ్లు 100% రిజిస్ట్రేషన్‌ అయ్యేలా చేస్తాం. సోషల్‌ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేసే సంఘాలను, వ్యక్తులను నమ్మొద్దు..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

రూ.8.11 లక్షల కోట్ల అప్పులున్నా సంక్షేమం ఆగదు 
‘గత పాలకులు మాపై రూ.8.11 లక్షల కోట్ల భారీ అప్పుల భారం మోపారు. నడుము వంగిపోయే అప్పుల భారం ఉన్నప్పటికీ, రూపాయి రూపాయి కూడబెట్టి ప్రజా సంక్షేమాన్ని నడిపిస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే కోళ్లకు, బర్రెలకు వేసే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.25 కోట్ల మంది ప్రజలకు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నాం. 55 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నాం..’ అని సీఎం తెలిపారు.  

కూకట్‌పల్లి రుణం తీర్చుకుంటా.. 
‘మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని కూకట్‌పల్లి నియోజకవర్గం నా రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించింది. నాడు నిధులు మంజూరు చేసే అధికారం లేకపోయినా బస్తీల్లో ప్రజలు నా వెన్నంటి నిలిచారు. ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఇప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చింది. కూకట్‌పల్లి అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు ఆదేశాలు ఇచ్చా. నియోజకవర్గంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, చెరువుల పునరుద్ధరణ, పాఠశాలలు, కళాశాలల నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  

వచ్చే ఏడాది ఇందిరమ్మ టవర్స్‌ నుంచి బోనాలు: పొంగులేటి 
‘ఇందిరమ్మ టవర్స్‌ నుంచి వచ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆనాటి ప్రభుత్వం కమీషన్లు రావనే కారణంతో పేదలకు ఇళ్ళు కట్టలేదని, కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించిందని ఆరోపించారు. దీనికి భిన్నంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం.. ఎకరా రూ.200 కోట్ల వరకు ఉన్నప్పటికీ హైదరాబాద్‌ మహానగరంలో పెద్ద పెద్ద టవర్స్‌ పక్కనే పేదలకు కూడా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించి ఆచరణలోకి తెచ్చిందని తెలిపారు. తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణానికి సంకల్పించామని దీనికి సంబంధించి ఇప్పటివరకు 51 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. అందరి సమక్షంలో ఎటువంటి లాలూచీలు లేకుండా, మంత్రుల సిఫారసులు సైతం లేకుండా అందరి ముందు లక్కీ డిప్‌ తీసి  ఇళ్లను కేటాయిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ముందే ఇళ్ల వివరాలను అందిస్తాం కాబట్టి వారు దగ్గరుండి కాంట్రాక్టర్‌తో నాణ్యంగా తమ ఇళ్ళను కట్టించుకోవచ్చునని సూచించారు. 

మూడింతల ఇళ్లు నిర్మించకుంటే మళ్లీ పోటీ చేయను 
గత ప్రభుత్వం పదేళ్లలో నిర్మించిన ఇళ్ల కంటే మరో రెండున్నరేళ్లలో మూడింతలు ఎక్కువగా ఇళ్లు నిర్మిస్తామని, ఒకవేళ అది చేయకపోతే తాను మరోసారి శాసనసభకు పోటీ చేయనని పొంగులేటి ప్రకటించారు. రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాంతంలో కొన్ని భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చారని, అవి ప్రభుత్వ భూములు కాకపోతే రెండు రోజుల్లోనే ఆ భూములపై నిషేధం తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement