ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి : కొండా సురేఖ | Grand Finale of Bonalu Celebrations: Minister Konda Surekha | Sakshi
Sakshi News home page

ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి : కొండా సురేఖ

Aug 13 2026 11:36 PM | Updated on Aug 13 2026 11:36 PM

Grand Finale of Bonalu Celebrations: Minister Konda Surekha

సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో విజయవంతంగా ముగిసిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జూలై 16న గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన బోనాల మహోత్సవం, బుధవారం (ఆగస్టు 13) జగదాంబిక అమ్మవారికి మహాకుంభహారతితో సంప్రదాయబద్ధంగా ముగిసిందని మంత్రి స్పష్టం చేశారు.

దాదాపు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరిగిన బోనాల వేడుకలు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళల ప్రదర్శన, అంబారీల ఊరేగింపు, రంగం, ఘటోత్సవాలతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయని అన్నారు.

ప్రభుత్వ పర్యవేక్షణలో ఘనంగా ఉత్సవాలు
బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. రూ. 20 కోట్ల నిధులతో ఆషాడ బోనాల జాతరను దేదీప్యమానంగా నిర్వహించామని చెప్పారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో వేలాది ఆలయాల్లో జరిగిన బోనాల వేడుకలు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా జరిగేందుకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, వైద్యారోగ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ, జలమండలి తదితర శాఖలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు, సహకరించిన స్వచ్ఛంద సంస్థలకు మంత్రి పేరుపేరునా అభినందనలు తెలిపారు.

లౌకిక సందేశానికి ప్రతీక హైదరాబాద్ బోనాలు
హైదరాబాద్‌ బోనాలు తెలంగాణ సమాజంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నాయని, గంగా జమునా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ యావత్ దేశానికి లౌకిక సందేశాన్నిస్తున్నాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం హైదరాబాద్‌ నగర ప్రత్యేకతను మరోసారి ప్రపంచానికి చాటిందని అన్నారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
“అమ్మవారి చల్లని చూపు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలి. రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలి. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి. అమ్మవార్ల దయతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక సామరస్యం మరింత బలపడాలి” అని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. దేవాదాయ శాఖ తరఫున నిర్వహించిన వరుణయాగంతో ప్రభుత్వ సంకల్పం సిద్ధించి, రాష్ట్రం వర్షాలతో కళకళలాడుతుండటం అమ్మవార్ల మహిమేనని పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement