చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి దెబ్బమీద దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా అన్నాడీఎంకే డిప్యూటీ ప్రచార కార్యదర్శి, ప్రముఖ ట్రాన్స్‌జెండర్ నాయకురాలు అప్సరా రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళనిస్వామికి తన రాజీనామా లేఖ పంపించారామె. డిప్యూటీ ప్రచార కార్యదర్శిగా నియమించిన సుమారు నెల రోజులకే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను లేఖలో వివరించారు. పార్టీలో పలువురు కార్యకర్తలు, నేతలను పదవుల నుంచి తొలగించడం, అంతర్గత విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తన నిర్ణయం కోపం, అసంతృప్తితో తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. అయితే పార్టీ నాయకత్వంపై తనకు ఎలాంటి కోపం లేదా అగౌరవం లేదని పేర్కొన్నారు. అన్నాడీఎంకేలో తనకు లభించిన అవకాశాలు, బాధ్యతలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాజకీయాల్లోనే కొనసాగుతా
అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకుంటున్నప్పటికీ తాను రాజకీయాలకు దూరం కాబోనని అప్సరా రెడ్డి స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రయాణం ఇకపై మరో దిశలో సాగవచ్చని, ప్రజాసేవ పట్ల తన నిబద్ధత మాత్రం మారదని తెలిపారు. ‘అమ్మ’ జయలలిత అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల కోసం పనిచేస్తానని, వినిపించని గొంతుకలకు వేదిక కల్పిస్తానని చెప్పారు. పళనిస్వామితో తన వ్యక్తిగత సంబంధాలు రాజకీయ నిర్ణయానికి అతీతంగా స్నేహపూర్వకంగానే కొనసాగాలని ఆశిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
పెరుగుతున్న రాజీనామాలు
అన్నాడీఎంకేలో ఐటీ విభాగం కార్యదర్శిగా పనిచేసిన సింగై జి రామచంద్రన్ మూడు రోజుల క్రితమే ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్‌ను కలిసి, అధికార టీవీకే పార్టీలో చేరారు. అంతకుముందు మాజీ మంత్రి వైగైచెల్వన్ కూడా పార్టీని వీడారు. తాజాగా అప్సరా రెడ్డి కూడా అన్నాడీఎంకేకు గుడ్ బై చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది ఆమె ఇంకా వెల్లడించలేదు.
చదవండి: అన్నాడీఎంకేకు గుడ్ బై.. విజయ్ పార్టీలో చేరిన యువనేత
— Apsara R (@talktoapsara) August 12, 2026


