లోక్‌సభ 19%.. రాజ్యసభ 39% | Parliament Monsoon Session Productivity: Kiren Rijiju Slams Opposition, Mallikarjun Kharge Hits Back | Sakshi
Sakshi News home page

లోక్‌సభ 19%.. రాజ్యసభ 39%

Aug 13 2026 1:08 PM | Updated on Aug 13 2026 1:15 PM

Parliament Productivity: Rijiju Slams Opposition Kharge Hits Back

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంట్‌ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వకుండా విపక్ష సభ్యులు పదేపదే నినాదాలు, నిరసనలకు దిగడంపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పార్లమెంట్‌ను నిరసనలకు వేదికగా మార్చడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

వర్షాకాల సమావేశాల్లో శాసనపరమైన కార్యక్రమాల పరంగా మంచి పనితీరు కనిపించిందని రిజిజు తెలిపారు. పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. అయితే పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చలు జరగడంలో మాత్రం సమావేశాలు ఆశించిన స్థాయిలో సాగలేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఉత్పాదకత కేవలం 19 శాతంగా నమోదైందని, రాజ్యసభ ఉత్పాదకత 39 శాతంగా ఉందని వివరించారు.

లోక్‌సభలో పలు అంశాలపై చర్చకు అవకాశం ఉన్నప్పటికీ.. విపక్ష సభ్యుల నిరసనల కారణంగా కార్యకలాపాలు పదేపదే అంతరాయం కలిగాయని రిజిజు ఆరోపించారు. కొంతమంది విపక్ష ఎంపీలు చర్చల్లో పాల్గొన్నారని అంగీకరించిన ఆయన.. లోక్‌సభలో పేపర్‌ లీక్‌ నిరోధక బిల్లుపై మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో చర్చ జరిగిందన్నారు. మిగతా సమయం పెద్దగా సద్వినియోగం కాలేదని పేర్కొన్నారు.

తొలిసారి చూశా..
విపక్షాల వైఖరిపై రిజిజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో తొలిసారిగా విపక్షాలు చర్చల నుంచి పారిపోతున్న పరిస్థితిని చూస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్‌ అంటే కేవలం నినాదాలు చేయడం, నిరసనలు వ్యక్తం చేయడం మాత్రమే కాదని.. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించి, వాటిపై చర్చ జరిపి పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని స్పష్టం చేశారు.

కొత్తగా ఎన్నికైన ఎంపీలకు విపక్ష సభ్యులు ఎలాంటి సంప్రదాయాలను నేర్పిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్‌కు తొలిసారి వచ్చిన సభ్యులు సభా సంప్రదాయాలను, చర్చల పద్ధతులను నేర్చుకోవాల్సిన సమయంలో.. నిరసనలు, నినాదాలే రాజకీయానికి మార్గమని చూపడం సరికాదని అన్నారు.

‘నినాదాలు రోడ్లపై చేయాలి’
పార్లమెంట్‌ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని రిజిజు పేర్కొన్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే దానిని సభలో చర్చ రూపంలో వ్యక్తం చేయాలని సూచించారు. నినాదాలు చేయాలనుకుంటే రోడ్లపై చేయొచ్చని.. కానీ పార్లమెంట్‌లో మాత్రం ప్రజా సమస్యలపై చర్చ జరగాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు ఎంపీలను పార్లమెంట్‌కు పంపుతున్నారని గుర్తు చేసిన రిజిజు.. సభా కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల చివరకు నష్టపోయేది ప్రజలేనని అన్నారు. పార్లమెంట్‌లో చర్చ జరగకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు.

‘ప్రజలే ఈ అహంకారాన్ని బద్దలు కొడతారు’
మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌కు వచ్చి విపక్షాల ఆందోళనలు, సమస్యలను వినడం లేదని ఆరోపించారు. వాళ్లు అసలు సభకు రాలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరి అహంకారంతో కూడుకున్నదని ఖర్గే విమర్శించారు. పార్లమెంట్‌ తమ ముందు ఏమీ కాదన్నట్లుగా, తామే సర్వస్వం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘వాళ్లు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. పార్లమెంట్‌కు ప్రాధాన్యత లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఈ అహంకారాన్ని ప్రజలే బద్దలు కొడతారు’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement