ఖర్గే సభా వేదిక ‘శుద్ధి’ వివాదం.. రాజ్యసభలో దుమారం | Rajya Sabha Row: Kharge Slams BJP Over Haldwani 'Purification' Ceremony, Nadda Promises Probe | Sakshi
Sakshi News home page

ఖర్గే సభా వేదిక ‘శుద్ధి’ వివాదం.. రాజ్యసభలో దుమారం

Aug 13 2026 11:48 AM | Updated on Aug 13 2026 11:52 AM

Purification Controversy in Rajyasabha: Kharge Slams BJP Nadda Hits Back

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో తన ర్యాలీకి కేటాయించిన వేదికను బీజేపీ నేతలు ‘శుద్ధి’ కార్యక్రమాలతో శుభ్రం చేశారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలు రాజ్యసభలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటన కుల వివక్ష, అంటరానితనానికి నిదర్శనమని ఖర్గే మండిపడ్డారు.

గురువారం రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఖర్గే.. హల్ద్వానీలోని రామలీలా మైదానంలో తన సభ జరగాల్సిన ప్రదేశంలో తన రాక తర్వాత కొందరు బీజేపీ నేతలు హవనం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని ఆరోపించారు. ఇది దళితుల పట్ల వివక్షను ప్రతిబింబిస్తోందని, బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెడుతోందని విమర్శించారు.

దీనిని బీజేపీ సమర్థించదు
ఖర్గే ఆరోపణలపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే.. ఇలాంటి చర్యలను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. “ఖర్గే జీ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ఇది కాంగ్రెస్‌కు మాత్రమే కాదు.. మనందరికీ బాధ కలిగించే విషయం. బీజేపీ ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ సమర్థించదు. ఘటనపై కచ్చితంగా విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం” అని నడ్డా హామీ ఇచ్చారు.

అయితే, ఈ ఘటనకు మొత్తం పార్టీని బాధ్యురాలిగా చూపడాన్ని నడ్డా ఖండించారు. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండానే బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఖర్గే మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నామని, ఈ అంశాన్ని పార్టీ అధ్యక్షుడి హోదాలో పరిశీలిస్తానని తెలిపారు.

రాజ్యసభలో వాడీవేడి చర్చ
ఖర్గే వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ఆరోపణలను ఖండించగా.. కాంగ్రెస్‌ సభ్యులు సామాజిక సమానత్వం, దళిత గౌరవం అంశాలను ప్రస్తావించారు. అంటరానితనం వంటి వివక్షకు ఎలాంటి స్థానం లేదని, ఘటన నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్షం పేర్కొంది. అయితే పార్టీపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని స్పష్టం చేసింది.

రాజ్యసభ ఛైర్మన్‌ తీవ్ర వ్యాఖ్యలు
ఈ వివాదంపై రాజ్యసభ ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ కూడా స్పందించారు. అంటరానితనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. “అంటరానితనం పాపం కాకపోతే.. ఈ ప్రపంచంలో అంతకంటే పెద్ద పాపం మరొకటి ఉండదు. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా మనమంతా దీనిని వ్యతిరేకిస్తున్నాం. మనల్ని ఎవ్వరూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు.. మనమంతా ఇప్పటికే శుద్ధులమే” అని అన్నారు. ఘటనపై విచారణ జరిపి, తప్పు చేసిన వారు ఎవరైనా ఉంటే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

‘హవనం అవసరం ఏమొచ్చింది?’.. ఖర్గే ఫైర్‌
ఇదే అంశంపై ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీపై మరింత తీవ్ర విమర్శలు చేశారు. “ఈ దేశంలో దళితులకు స్థానం లేదని మేం చాలా కాలంగా చెబుతున్నాం. అసలు అక్కడ హవనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని ప్రశ్నించారు. హల్ద్వానీ రామలీలా మైదానంలో అన్ని పార్టీల నేతలు సభలు నిర్వహిస్తుంటారని, కానీ తన సభకు ముందు నిర్వహించిన శుద్ధి కార్యక్రమం హిందూ ధర్మ స్ఫూర్తికి కూడా విరుద్ధమని ఖర్గే వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలేనని ఆరోపించిన ఖర్గే.. దేశాన్ని విభజించేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement