సాక్షి, ఢిల్లీ: అనకాపల్లిలో పంచదారల కొండలను పరిరక్షించాలి రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. పంచదారల వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలన్నారు. పంచదారల కొండలలో జరిగిన మైనింగ్‌పై వెంటనే విచారణ జరగాలని కేంద్రాన్ని ఆయన కోరారు. పవిత్ర, చారిత్రక, పర్యావరణ సున్నిత ప్రాంతాలను ‘నో మైనింగ్ జోన్’లుగా గుర్తించాలన్నారు.
రాజ్యసభలో మైన్స్ అండ్ మినరల్స్ బిల్లు పై చర్చ జరిగింది. ఈ సందర్బంగా వైఎస్సార్‌సీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘అనకాపల్లిలో పంచదారల కొండను పరిరక్షించాలి. పంచదారలను మైనింగ్-ఫ్రీ హెరిటేజ్ జోన్‌గా ప్రకటించాలి. పంచదారల వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిత ప్రాంతం ఇది. పంచదారల హిల్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ కొండపై ఏఎస్‌ఐ రక్షిత ధన దిబ్బలు బౌద్ధ సైట్, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి 90-200 మీటర్ల దూరంలోనే క్వారీలు జరుగుతున్నాయి. 2024–2025 శాటిలైట్ చిత్రాలు వారసత్వ జోన్ వైపు క్వారీలు వేగంగా ముందుకు సాగుతున్నట్లు చూపిస్తున్నాయి.
బ్లాస్టింగ్, తవ్వకాల వల్ల నీటి వనరులు, భూగర్భ జలాలు, కొండ స్థిరత్వం ప్రమాదంలో పడిపోయింది. వెంటనే సమగ్ర పర్యావరణ అంచనా, హైడ్రోజియోలాజికల్ స్టడీ, మైనింగ్ నిలిపివేత, ‘మైనింగ్-ఫ్రీ హెరిటేజ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. 2019–2024లో ఏపీఎండీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్, స్థిర ధరలతో సంవత్సరానికి సుమారు ₹765 కోట్లు (5 ఏళ్లలో ₹3,825 కోట్లు) రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ప్రస్తుత ‘ఫ్రీ ఇసుక’ విధానంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా కోల్పోయి, కృష్ణ, పెన్నా నదుల్లో అక్రమ తవ్వకాలు, చేతిరాత స్లిప్‌లు, క్యూఆర్ కోడ్‌లతో అనధికారిక వసూళ్లు, నదీతీరాలు, భూగర్భ జలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.
పవిత్ర, చారిత్రక, పర్యావరణ సున్నిత ప్రాంతాలను ‘నో మైనింగ్ జోన్’లు గుర్తించాలి. రాష్ట్రవ్యాప్త డిజిటల్ ట్రేసబిలిటీ అండ్ బుకింగ్ వ్యవస్థ రావాలి. మైనింగ్ అనుమతులను నీటి భద్రత, స్థానిక హైడ్రాలజీకి అనుసంధానం చేయాలి. ఫెడరల్ రక్షణలు, రాష్ట్ర ఆదాయాలు, పర్యావరణ వారసత్వం రాజీ లేకుండా కాపాడాలి అని వ్యాఖ్యానించారు.


