డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. టెన్నెల్‌లో ప్రమాదం చోటు చేసుకొని పలువురు కార్మికులు మృత్యువాత పడ్డారు. చమోలీ జిల్లాలో పిపాల్‌కోటి సమీపంలోని మాయాపూర్‌లో నిర్మిస్తున్న టీహెచ్‌డీసీ టన్నెల్‌లోకి అకస్మాత్తుగా నీరు, బురద చేరడంతో 19 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన వారి కోసం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.
పోలీసుల సమాచారం మేరకు.. చమోలీలో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన ‘టెయిల్ రేస్ టన్నెల్’లో సుమారు 1.4 కిలోమీటర్ల లోతులో భూమి కుంగి రంధ్రం ఏర్పడింది. దీంతో అకస్మాత్తుగా నీరు, బురద లోపలికి రావడంతో అప్పటికే విధులు నిర్వహిస్తున్న 22 మంది కార్మికులలో 19 మంది చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ , ఎస్‌డీఆర్‌ఎఫ్ , ఐటీబీపీ, ఆర్మీ బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన సహాయక చర్యలతో ఇప్పటికే 16 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మిగిలిన కార్మికులను బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేశారు.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని పేర్కొంటూ, సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.


