న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మరో లేఖ రాశారు. తొలుత రాసిన లేఖలో మార్పులు, చేర్పులు చేస్తూ ఈ లేఖ ఉంది. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థులు అమాయకులని బీసీఐ పేర్కొంది. ఎన్‌రోల్‌మెంట్ నిలిపేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. బయటి వ్యక్తులే కుట్ర చేశారని బీసీఐ పేర్కొంది. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ కొనసాగుతుందని బీసీఐ తెలిపింది.
కాగా, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి 2026లో న్యాయ పట్టా పొందిన విద్యార్థులను తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అడ్వకేట్లుగా ఎన్‌రోల్ (నమోదు) చేయవద్దని భారత బార్ కౌన్సిల్ (బీసీఐ) చైర్మన్ గురువారం అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే.
అలాగే, నల్సార్ కాన్వొకేషన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ జరిపిన ప్రచారంలో పాల్గొన్న వారిపై వాస్తవ నివేదిక సమర్పించాలని యూనివర్సిటీని కోరారు. "తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, 2026 సంవత్సరంలో నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నుంచి న్యాయ పట్టా పొందిన ఏ విద్యార్థినీ ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా అడ్వకేట్‌గా నమోదు చేయకూడదు" అని బీసీఐ చైర్మన్ నల్సార్ వైస్-చాన్సలర్‌కు, అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు పంపిన లేఖలో పేర్కొన్నారు. గత వారం, ఢిల్లీ విద్యార్థుల నిరసనలపై సీజేఐ చేసిన వ్యాఖ్యల కారణంగా, కాన్వొకేషన్‌కు ఆయనను ఆహ్వానించడాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకించినట్టు వార్తలు వచ్చాయి.
ఆ లేఖ విడుదల చేసిన కొన్ని గంటలకే బీసీఐ వెనక్కి తగ్గడం గమనార్హం. ఎన్‌రోల్‌మెంట్ నిలిపేయాలన్న ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు చెప్పింది.


