మరోసారి లాయరైన మమత  | West Bengal Ex-CM Mamata Banerjee Appears At Kolkata High Court In Lawyer Attire | Sakshi
Sakshi News home page

మరోసారి లాయరైన మమత 

May 15 2026 12:57 AM | Updated on May 15 2026 12:57 AM

West Bengal Ex-CM Mamata Banerjee Appears At Kolkata High Court In Lawyer Attire

టీఎంసీ కార్యకర్తలు, మైనారిటీలపై దాడులు జరిగాయి 

ఎన్నికల అనంతర హింసపై కలకత్తా హైకోర్టులో వాదనలు

శాంతిభద్రతలను కాపాడాలంటూ ప్రభుత్వానికి కోర్టు ఆదేశం

కోల్‌కతా/న్యూఢిల్లీ: టీఎంసీ అధినేత్రి, పశ్చి మ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీ మరోసారి నల్ల కోటు వేసుకుని కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస పెచ్చరిల్లిందంటూ ఆరోపించారు. టీఎంసీ కార్యకర్తలు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్‌ సందర్భంగా అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరిలో మమత నల్లకోటు ధరించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం తెల్సిందే. 

కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4వ తేదీ నుంచి టీఎంసీ పార్టీ కార్యాలయాలు, కార్యకర్తలపై దాడు లు జరుగుతున్నాయని సిర్సన్యా బందోపా ధ్యాయ వేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పౌల్‌ సారథ్యంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ కుమారుడైన సిర్సన్యా బందోపాధ్యాయ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. హైకోర్టులో మొదటిసారిగా హాజరైన మమత.. కల్యాణ్‌ బెనర్జీకి తోడుగా వాదనలు వినిపించారు. దాడులకు పాల్పడే వారి నుంచి ప్రజలను కాపాడాలని హైకోర్టు ను కోరారు. 

ఎన్నికల అనంతరం జరిగిన దాడుల్లో కనీసం 10 మంది చనిపోగా, 160 మంది టీఎంసీ కార్యాలయాలను ధ్వంసం చేశారని, కనీసం 2 వేల హింసాత్మక ఘటనలు నమోదయ్యాయని చెప్పారు. చేపలు, మాంసం దుకాణాలనూ లక్ష్యంగా చేసుకున్నారన్నారు. కోల్‌కతాలో అక్రమ కట్టడాలను కొత్తగా వచ్చిన సువేందు అధికారి ప్రభుత్వం కూల్చివేస్తుండటాన్ని మమత ప్రస్తావిస్తూ ‘యూపీ మాదిరిగా బెంగాల్‌ బుల్‌డోజర్‌ రాష్ట్రం కాదు’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. స్పందించిన ధర్మాసనం.. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను తప్పనిసరిగా కాపాడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

హింసాత్మక వాతావరణంలో ఇళ్లు వదిలి వెళ్లిపోయిన వారు తిరిగి సురక్షితంగా చేరుకునేందుకు అనువైన వాతావరణం కల్పించాలని కోరింది. ఈ విషయంలో పార్టీలకతీతంగా వ్యవహరించాలంది. మూడు వారాల్లోగా అఫిడవిట్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరీ అవసరమనిపిస్తే మరో రెండు వారాలు సమయం తీసుకోవచ్చని తెలిపింది. కాగా, తీర్పు అనంతరం మమత కోర్టు ప్రాంగణం నుంచి వెళ్లిపోతుండగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు లాయర్లు ఆమెనుద్దేశించి దొంగ.. దొంగ అంటూ కేకలు వేశారు. కోర్టు తీర్పును తమ విజయంగా టీఎంసీ అభివర్ణించింది. బీజేపీ నిజం స్వరూపం బయటపడిందంటూ వ్యాఖ్యానించింది.

బీసీఐ సీరియస్‌.. 
మమత హైకోర్టులో వాదనలు వినిపించారంటూ వచ్చిన వార్తలపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) స్పందించింది. మమత లాయర్‌గా నమోదయ్యారా? ఒక వేళ అయితే సీఎంగా ఉండగా 2011–2026 మధ్య కాలంలో ఆమె లాయర్‌ సభ్యత్వం పరిస్థితి ఏమిటి?వంటి వివరాలను 48 గంటల్లోగా అందజేయాలని పశ్చిమ బెంగాల్‌ బార్‌ కౌన్సిల్‌ను కోరింది. రాజ్యాంగ పదవి, లాభదాయక ఉద్యోగాల్లో ఉన్న వారు, ఆ కాలంలో బార్‌ లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసుకోవాల్సి ఉంటుంది.   

Advertisement
 
Advertisement
Advertisement