రాంచీ: నగరంలో నిరసన చేపట్టిన జేపీఎస్సీ, జేఎస్సీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు తీసుకున్న చర్యల్లో పలువురు అభ్యర్థులు గాయపడ్డారు. ఈ ఘటన ఝార్ఖండ్ అంతటా తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. నియామకాలకు సంబంధించిన డిమాండ్లపై శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా చీకట్లో తమపై లాఠీచార్జ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వీడియోలు పోలీసుల చర్యపై చర్చను మరింత తీవ్రం చేశాయి. ఈ ఘటన తమ నిరసన దిశను ఎలా మార్చిందో తెలుసుకునేందుకు జాతీయ మీడియా రాంచీలోని ధుర్వా మోర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న అభ్యర్థులతో మాట్లాడింది.
జేపీఎస్సీ అభ్యర్థి రూపేశ్ కుమార్ పాల్ ప్రస్తుతం 8వ రోజు నిరాహార దీక్షలో ఉన్నారు. పోలీసుల చర్య తమ సంకల్పాన్ని మరింత బలపరిచిందని ఆయన చెప్పారు. “పోలీసుల లాఠీలకు, వాటర్ కానన్లకు మేము భయపడము. మా డిమాండ్లు నెరవేరే వరకు నిరాహార దీక్ష, నిరసన కొనసాగుతుంది” అని ఆయన అన్నారు. 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న రూపేశ్.. 11వ, 12వ, 13వ, ఇప్పుడు 14వ జేపీఎస్సీ పరీక్షలు రాశానని చెప్పారు. ప్రతి నియామక ప్రక్రియలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
“నేను చాలా పేద రైతు కుటుంబం నుంచి వచ్చాను. నాకు నలుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అదృష్టవశాత్తూ నా పెద్ద అన్నకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. అదే మా కుటుంబానికి అండగా నిలుస్తోంది. లేకపోతే నేను మళ్లీ పరీక్ష రాసే పరిస్థితిలో ఉండేవాడిని కాదు” అని చెప్పారు. ఆగస్టు 10 ఘటన తర్వాత మరింత మంది విద్యార్థులు నిరసన స్థలానికి చేరుకున్నారని, ప్రభుత్వంతో న్యాయమైన చర్చల కోసం కోర్ కమిటీ ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు.
ఏళ్ల తరబడి నిరీక్షణ.. ఉద్యోగం లేదు
బొకారో జిల్లాలోని కస్మార్ ప్రాంతానికి చెందిన హబీబా కూడా నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. 2017 నుంచి ఆలస్యమైన నియామక ప్రక్రియల మధ్య తాను చిక్కుకుపోయానని ఆమె చెప్పారు. పంచాయత్ కార్యదర్శి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత నియామక ప్రక్రియలోని పలు దశలు పూర్తి చేసినా, వయోపరిమితిలో ఒక్క రోజు తక్కువగా ఉండటంతో తన ఫలితాన్ని నిలిపివేశారని చెప్పారు.
తన తండ్రి అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబం ఆ ఉద్యోగంపైనే ఆశలు పెట్టుకుందని ఆమె తెలిపారు. హబీబా 3 సార్లు జేపీఎస్సీ పరీక్ష కూడా రాశారు. అభ్యర్థుల డిమాండ్లు ఆమోదించే వరకు నిరసన కొనసాగిస్తానని చెప్పారు.
వారు ఓట్ల కోసం వస్తే కర్రలతో..
మరో నిరసనకారుడు రాహుల్ కుమార్ పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్యమం ఝార్ఖండ్ అంతటా విస్తరిస్తుందని హెచ్చరించారు. “ప్రభుత్వానికి లాఠీ భాషే అర్థమైతే మా యువత మౌనంగా ఉండదు. ఇప్పుడు ఝార్ఖండ్‌లో ప్రతి బ్లాక్‌లో, ప్రతి గ్రామంలో తిరుగుబాటు కనిపిస్తుంది” అని అన్నారు.
“రాబోయే రోజుల్లో ఏ గ్రామంలోనూ, జిల్లాలోనూ, బ్లాక్‌లోనూ ఏ మంత్రి, ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించనివ్వము. వారు వస్తే మా యువత కర్రలతో తరిమేస్తుంది. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మమ్మల్ని కొట్టిన విధంగానే ప్రతిస్పందన ఎదురవుతుంది” అని అన్నారు. మేము ఉద్యోగాలు అడిగితే కర్రలతో మమ్మల్ని తరిమేశారు. ఇప్పుడు వారు ఓట్లు అడగటానికి వస్తే మేమూ కర్రలతో వారిని తరిమేస్తాం” అని చెప్పారు.
చర్చల డిమాండ్
దేవేంద్ర నాథ్ మహతో నేతృత్వంలో, రాహుల్ క్రాంతి, రూపేశ్ కుమార్ పాల్, హబీబా, సవితా కుమారి పాల్గొంటున్న నిరాహార దీక్ష రాంచీలో కొనసాగుతోంది. తమ డిమాండ్లు ఉద్యోగాలకే పరిమితం కావని, నియామకాల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కూడా జరగాలని నిరసనకారులు చెబుతున్నారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.


