జంతర్‌ మంతర్ సీజన్-2లో ఏం చేస్తారు? ఎప్పుడు షురూ? | what is jantar mantar season 2 full details here | Sakshi
Sakshi News home page

జంతర్‌ మంతర్ సీజన్-2లో ఏం చేస్తారు? ఎప్పుడు షురూ?

Aug 13 2026 8:31 PM | Updated on Aug 13 2026 8:57 PM

what is jantar mantar season 2 full details here

న్యూఢిల్లీ: జంతర్‌మంతర్ వద్ద 36 రోజుల పాటు ఉద్యమం నిర్వహించి నెల కూడా పూర్తికాకముందే.. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 'సీజన్-2' త్వరలో మొదలవుతుందని ప్రకటించారు. సీజన్‌-2లో ఏం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అది ఎలా ముందుకు వెళ్లనుందన‍్న ఆసక్తి అందరిలోనూ ఉంది. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా ఈ సారి సీజేపీ ముందుకు వస్తోంది.

సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రాంకా మాట్లాడుతూ.. సీజన్-2లో అసలు ఏం జరగబోతోందో వివరించారు. ఈసారి పార్టీ దృష్టి దేశంలోని పాఠశాలల పరిస్థితిని మెరుగుపరచడంపై ఉంటుందని చెప్పారు. పాఠశాలల విషయంలో తమ మాట ప్రభుత్వం వినకపోతే మళ్లీ ఉద్యమం చేస్తామని చెప్పారు. 'స్కూల్ ఠీక్ కరో అభియాన్' ఆగస్టు 15 నుంచి మొదలవుతుందని అన్నారు. 

పాఠశాలలు బాగుపడాల్సిందే.. 
సీజేపీ కొత్త ప్రచారాన్ని ప్రారంభించబోతుందని ఆశుతోష్ ప్రకటించారు. ‘‘మా పిల్లలను పాఠశాలలకు దూరంగా ఉండనివ్వం. ఇదే జంతర్‌మంతర్ సీజన్-2. ఈ ప్రచారానికి దేశ ప్రజలే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. గ్రామాల్లో ఉన్న పిల్లలను విద్యకు దూరంగా ఉంచారు. గత కొన్ని సంవత్సరాల్లో దేశంలో 94 వేల పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లలను బలహీనంగా ఉంచాలనే ప్రభుత్వ ప్రయత్నంలా ఇది కనిపిస్తోంది" అన్నారు.

ప్రచార సమయంలో ఏం చేస్తారో కూడా రాంకా వివరించారు. "దేశవ్యాప్తంగా సర్పంచ్‌లను తమ పాఠశాలలను మెరుగుపరచాలని కోరుతాం. రాబోయే నెలల్లో మా బృందం దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలను సందర్శిస్తుంది. ఈ పాఠశాలలను మెరుగుపరచాలని కలిసి డిమాండ్ చేస్తాం. సర్పంచ్‌లకు పూర్తిగా మద్దతు ఇస్తాం" అన్నారు.

పాఠశాలలను మెరుగుపరచని చోట తమ పార్టీ నిరసనలు కూడా చేపడుతుందని చెప్పారు. సీజేపీ బృందాలు వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలను సందర్శించనున్నాయి. పాఠశాలలు మెరుగుపడని ప్రాంతాల్లో నిరసనలు చేపడతాయి. నీట్ ఉద్యమం ముగిసినా తమ పోరాటం ముగియలేదని, ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఇతర సమస్యలపై దృష్టి పెడతామని సీజేపీ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement