న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పార్టీ నిరసన కార్యక్రమాల్లో మరో దశకు చేరుకుంటుందన్న సంకేతాలు ఇచ్చారు. తమ ‘జంతర్ మంతర్’ ఉద్యమం ‘సీజన్ 2’ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.
“ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది ‘జంతర్ మంతర్’ సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందని కామెంట్లు చేస్తున్నారు. వారికి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, ‘జంతర్ మంతర్’ సీజన్ 2 చాలా త్వరలో మొదలుకానుంది” అని దిప్కే చెప్పారు.
తదుపరి దశ నిరసనలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో, ఏ డిమాండ్లపై దృష్టి పెడతాయన్న వివరాలను దీప్కే వెల్లడించలేదు. అయితే, జంతర్ మంతర్ వద్ద గతంలో చేపట్టిన ఉద్యమం తర్వాత ఇప్పుడు మరోసారి నిరసనల వేదికపైకి రావడానికి సీజేపీ సిద్ధమవుతోందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పాఠశాలకు సరైన రహదారి కావాలని డిమాండ్ చేస్తూ హమీర్‌పూర్ జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన పాఠశాల విద్యార్థుల నిరసనకు కూడా దీప్కే మద్దతు ప్రకటించారు. దాదాపు 300 మంది విద్యార్థులు, 100 మంది తల్లిదండ్రులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి దుస్థితిని విద్యార్థులు ప్రస్తావించారు. విద్యార్థులను దిప్కే ప్రశంసించారు. ప్రాథమిక రవాణా సౌకర్యం కోసం వారు చేస్తున్న డిమాండ్ దశాబ్దాల క్రితమే నెరవేరాల్సిందని అన్నారు.
అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు
సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. దిప్కే చేసిన “జంతర్ మంతర్ సీజన్ 2” వ్యాఖ్య కేవలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరో నిరసనకే పరిమితం కాదన్నారు. ఇదే సీజన్ 2. ఇలాంటి అసమర్థ ప్రభుత్వాలు, అధికారులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినేందుకు సీజేపీ తరఫున ఇప్పుడు దేశవ్యాప్త ‘లిజనింగ్ టూర్’ ప్రారంభిస్తున్నాం. ఒక ప్రచార కార్యక్రమం చేపడతాం. స్వాతంత్య్ర దినోత్సవం నుంచి విద్యా అంశానికి ప్రాధాన్యం ఇస్తున్నాం” అని ఆయన అన్నారు.


