ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్..
2025 కటాఫ్‌ల ఆధారంగా 2026లో అవకాశాలపై అంచనా
ప్రభుత్వ కాలేజీల్లో లక్షలోపు ర్యాంకులకు ఎక్కువ పోటీ
కొత్త ప్రభుత్వ కాలేజీల్లో మరింత దిగువ ర్యాంకులకూ చాన్స్
ప్రైవేట్ కన్వీనర్ కోటాలో 2–2.7 లక్షల ర్యాంకులకూ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు కోసం విద్యార్థుల దృష్టి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించే కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌పై పడింది. ఆలిండియా కోటా కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా, ఈనెల 13 నుంచి రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ మొదలవుతోంది. గతేడాది కౌన్సెలింగ్‌లో ఏ స్థాయి ర్యాంకులకు ఎక్కడ సీట్లు దక్కాయన్నది ఈసారి విద్యార్థులకు మార్గదర్శకంగా మారనుంది. నీట్ ఫలితాల్లో ఎన్‌టీఏ ఇచ్చే దేశవ్యాప్త ర్యాంకే ఏఐఆర్ కాగా, తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ కోటాకు దరఖాస్తు చేసిన అర్హులైన అభ్యర్థులకు కాళోజీ వర్సిటీ స్థానికత, కేటగిరీ, రిజర్వేషన్లు తదితర నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించి స్టేట్ మెరిట్ ర్యాంకు ఇచ్చింది. ఈ లెక్కన రాష్ట్రం నుంచి 38,021 మంది ఏఐఆర్ కింద అర్హత పొందారు. అధికారిక మెరిట్ జాబితాలో ఒకే అభ్యర్థికి స్టేట్ మెరిట్‌తోపాటు ‘నీట్ ర్యాంకు’రెండూ వేర్వేరు. ఉదాహరణకు ఈ సంవత్సరం ఆలిండియా కోటాలో 13వ ర్యాంకు వచ్చిన వీరయ్య గారి సాహూకు స్టేట్ మొదటి ర్యాంక్ వచ్చింది. గత సంవత్సరం కౌన్సెలింగ్ మెరిట్ జాబితాలో ఒక అభ్యర్థికి రాష్ట్ర మెరిట్ 1,989 కాగా నీట్ ర్యాంకు 65,090గా ఉంది. ఈ లెక్కన స్టేట్ ర్యాంకుతో సంబంధం లేకుండా జాతీయ స్థాయి ర్యాంక్స్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కడ అవకాశం?
గాందీ, ఉస్మానియా, కాకతీయ వంటి పాత ప్రభుత్వ వైద్య కళాశాలలకు పోటీ తీవ్రంగా ఉంటుంది. 2025 తొలి దశలో ఉస్మానియాలోనే ఓసీ అభ్యర్థులకు 681; 2,915 వంటి అత్యుత్తమ ‘నీట్’ఆలిండియా ర్యాంకుల వద్ద సీట్ల కేటాయింపు జరిగింది. అయితే కేటగిరీ ఆధారంగా కటాఫ్‌లో భారీ తేడా ఉంటుంది. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ ఉపకేటగిరీలు, ఈడబ్ల్యూఎస్, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలు కలిసినప్పుడు అదే కాలేజీలో సీటు పొందిన చివరి ర్యాంకు మారుతుంది. 2025లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పాత ప్రభుత్వ కాలేజీలతో పోలిస్తే చివరి ర్యాంకులు దిగువకు వెళ్లాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కొత్త జిల్లాల వైద్య కళాశాలల్లో చివరి రౌండ్లలో సీట్ల కోసం పోటీ తగ్గింది. 2026లో కూడా ఇదే ధోరణి కొనసాగితే లక్ష నుంచి 1.5 లక్షల పరిధిలోని ర్యాంకులు కొన్ని ప్రభుత్వ కాలేజీలకు పోటీ పడే అవకాశం ఉంది. రిజర్వేషన్ కేటగిరీల్లో ఈ పరిధి మరింత దిగువకు వెళ్లవచ్చు.
ప్రైవేట్ ‘ఏ’కేటగిరీలో భారీ పరిధి
ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో గతేడాది చివరి దశల్లో గణనీయంగా దిగువ ర్యాంకులకు కూడా సీట్లు వచ్చాయి. 2025 స్ట్రే వేకెన్సీ అలాట్‌మెంట్‌లో చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో ఓసీ కేటగిరీకి 2,05,624 ఆలిండియా ర్యాంకు వద్ద సీటు వచ్చింది. అదే దశలో నోవా ఇన్‌స్టిట్యూట్‌లో బీసీ–బీ విద్యార్థికి 2,20,307 ర్యాంకు, సురభి కాలేజీలో ఎస్టీ అభ్యర్థికి 2,70,751 ర్యాంకు వరకు సీటు దక్కింది. అలాగే మహావీర్ ఇన్‌స్టిట్యూట్‌లో బీసీ–ఈకి 2,58,041, బీసీ–డీకి 2,11,285, సీఎంఆర్ కాలేజీలో బీసీ–బీకి 2,47,404, అరుంధతి ఇన్‌స్టిట్యూట్‌లో బీసీ–బీకి 2,35,806, బీసీ–ఏకు 2,76,991 ర్యాంకుల వరకు అలాట్‌మెంట్లు నమోదయ్యాయి. మైనారిటీ కళాశాలల్లో చూస్తే.. 2025లో షాదన్‌లో బీసీ–ఈ కేటగిరీకి 2,17,212, డెక్కన్ కాలేజీలో 1,85,372 ర్యాంకు వద్ద సీటు వచ్చింది. డాక్టర్ వీఆర్‌కే ఉమెన్స్ కాలేజీలో బీసీ–ఈ మహిళలకు 3,57,746 ర్యాంకుకూ సీట్లు దక్కాయి.
ఈ ఏడాది ర్యాంకుల వారీగా అంచనా
గతేడాది చివరి దశ ఫలితాలను తీసుకుంటే 50 వేలలోపు ఆలిండియా ర్యాంకులు ఉన్నవారికి ఉస్మానియా, గాం«దీ, కాకతీయ, రిమ్స్‌తోపాటు ఎయిమ్స్ వంటి జాతీయ కళాశాలల్లో సీట్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. 50 వేలు– లక్ష మధ్య ర్యాంకులకు ఇతర ప్రభుత్వ కాలేజీల్లో అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 1–1.5 లక్షల మధ్య ర్యాంకులు కొత్త ప్రభుత్వ కాలేజీలు, మెరుగైన ప్రైవేట్ ‘ఏ’కేటగిరీ కాలేజీలను లక్ష్యంగా పెట్టుకోవచ్చు. అలాగే 1.5–2 లక్షల ఆలిండియా ర్యాంకుల మధ్య ఉన్నవారికి కొత్త ప్రభుత్వ కాలేజీల చివరి దశలు, ప్రైవేట్ ‘ఏ’కేటగిరీ ముఖ్యమైన అవకాశాలుగా చెప్పుకోవచ్చు. 2–2.5 లక్షల ఏఐఆర్ మధ్య ఉన్నవారు ప్రైవేట్ కన్వీనర్ కోటాలో ముఖ్యంగా చివరి దశలను ఆశించవచ్చని చెబుతున్నారు. అలాగే, 2025లో బీసీ–ఏకి 2.76 లక్షల వరకు సీట్లు వచ్చిన ఉదంతాలున్నాయి.


