భూసేకరణపై మధ్యంతర స్టే ఎత్తివేసిన హైకోర్టు..
చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సర్కార్‌కు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి చాంద్రాయణగుట్ట మధ్య ప్రతిపాదిత హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2, కారిడార్–6 పనులకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భూసేకరణకు సంబంధించి గతంలో విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భూసేకరణ ప్రక్రియ చట్టబద్ధంగా, సంబంధిత నిబంధనలను పాటిస్తూ కొనసాగించాలని స్పష్టం చేసింది. మెట్రో ప్రాజెక్టు పనులు నిలిచిపోతే నగరంలోని సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం పడుతుందని చెప్పింది. ఇతర అంశాలన్నీ తామిచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెబుతూ విచారణ వాయిదా వేసింది.
భూసేకరణ ప్రక్రియలో తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్ మీరాలం మండికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రవూఫ్‌తోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. పిటిషనర్ల ఆస్తులకు సంబంధించి అవార్డు జారీ చేయకుండా గత అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ ఇటీవల ప్రభుత్వం మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేసింది. ఈ ఐఏపై జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
చట్టవిరుద్ధంగా సాగితేనే జోక్యం
ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత రహదారి వెడల్పు 60 అడుగులు కాగా, హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం దానిని 100 అడుగులకు విస్తరించేందుకు భూసేకరణ చేపట్టినట్లు తెలిపారు. మెట్రో మార్గం కోసం హెచ్‌ఏఎంఎల్ డ్రోన్, లైడార్ సర్వే సాంకేతికతలను ఉపయోగించి ఆస్తులను సర్వే చేశామన్నారు. రహదారిపై నిర్మాణాలు ఒకేలైన్‌లో లేకపోవడంతో ఇరువైపులా భూసేకరణ విస్తీర్ణం సమానంగా ఉండటం సాధ్యం కాదన్నారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ ప్రాంతంలో మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.3 నుంచి 4 లక్షల వరకు ఉండగా, అధికారులు రూ.30,989గా నిర్ణయించినట్లు తెలిపారు. చర్చల అనంతరం అంగీకార అవార్డు కింద భూమి విలువకు చదరపు గజానికి రూ.81,000 చెల్లించడంతోపాటు పునరావాస, పునఃనిర్మాణ (ఆర్‌అండ్‌ఆర్) ప్రయోజనాలు అందిస్తున్నట్లు ఏఏజీ పేర్కొన్నారు.
నిర్వాసిత కుటుంబానికి రూ.12.04 లక్షలు, వ్యాపారం లేదా అద్దె ఆదాయం కోల్పోయే ప్రభావిత కుటుంబానికి రూ.6 లక్షల ఆర్‌అండ్‌ఆర్ నగదు ప్రయోజనం అందిస్తున్నట్లు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సమగ్ర సర్వే, సాంకేతిక నిపుణుల పరిశీలన అనంతరం అధికారులు అలైన్‌మెంట్‌ను నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పారు. అలైన్‌మెంట్ నిర్ణయం ఏకపక్షంగా, దురుద్దేశపూర్వకంగా లేదా చట్ట, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉంటేనే తాము జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.


