వరుణ యాగంలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, గీత దంపతులు. చిత్రంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి, జానారెడ్డి, శంకర్‌నాయక్, అనిల్‌కుమార్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, రాంచంద్రనాయక్, గద్వాల విజయలక్ష్మి తదితరులు
మహా వరుణ యాగంలో సీఎం రేవంత్‌రెడ్డి
కృష్ణమ్మకు పూర్ణాహుతి సమర్పణ
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడాలని ప్రార్థన
నాగార్జునసాగర్‌లోని కృష్ణా తీరాన శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు
108 మంది రుత్వికులు.. 11 హోమ గుండాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ అతిథి గృహం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో క్రతువులు నిర్వహించారు. కృష్ణమ్మకు సీఎం పూర్ణాహుతి సమర్పించారు. ‘రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి. కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి. ప్రాజెక్టులు, చెరువులు నిండాలి..’అని ప్రార్థించారు.
బ్రహ్మ ముహూర్తంలో..
సోమవారం ఉదయం 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో యాగాన్ని ప్రారంభించారు. ప్రారంభ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమ గుండాలతో వరుణ దేవుని అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ వైదిక విధానంలో హోమ క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు యాగశాలలోకి వచ్చిన సీఎం దంపతులు..3:24 గంటలకు పూర్ణాహుతి సమర్పించారు. ‘కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు సమృద్ధిగా పడాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళను సంతరించుకోవాలి. భూగర్భ జలాలు పెరగాలి. పంటలు పుష్కలంగా పండాలి. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి.
రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలి..’అని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయం. కాగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, నేనావత్ బాలునాయక్, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కృష్ణమ్మ ఒడ్డున మార్మోగిన వేదఘోష
సూర్యకిరణాలు ఇంకా కృష్ణమ్మ జలాలను తాకకముందే.. నాగార్జునసాగర్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సోమవారం తెల్లవారుజాము నుంచే వేద మంత్రాలు మార్మోగాయి. చతుర్వేద పారాయణంతో యాగ క్రతువు ప్రారంభమైంది. ప్రధాన యాగ క్రతువుల కోసం 32 మంది రుత్వికులు యాగశాలలో నిర్దేశించిన స్థానాల్లో ఆశీనులు కాగా, మిగిలిన రుత్వికులు నిరంతర వేద పారాయణం, జపంలో పాల్గొన్నారు. చతుర్వేద పారాయణం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. హోమకుండాల్లో పవిత్ర అగ్నిని ప్రజ్వలింపజేసి, వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. ఆకాశం–జలం–భూమి–మానవాళి మధ్య సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేద మంత్రాల నడుమ హోమ ద్రవ్యాలను అగ్నికి సమర్పించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి, మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు, వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది.
వరుణారాధనతో విజయపురికి ప్రాచీన అనుబంధం
మహా వరుణ యాగం నిర్వహిస్తున్న ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని యాగ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి నాగార్జునసాగర్ ప్రాంతం ఒకనాటి విజయపురిగా ప్రసిద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలోనే వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని వేద పండితులు వివరించారు. వరుణుడితో సంబంధం ఉన్న ఒక ప్రాచీన ప్రతిమ ప్రస్తుతం నల్లగొండ మ్యూజియంలో భద్రపరచబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న మహా వరుణ యాగానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత చేకూరిందని తెలిపారు. శతాబ్దాల కిందట జలాల కోసం ఇదే నేలపై వినిపించిన వరుణ ప్రార్థన, ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఒడ్డున వేదఘోషగా ప్రతిధ్వనిస్తోందన్న భావన యాగానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులు యాగ నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. ప్రధాన అర్చకులు ఆచార్య వెంకటాచార్యులు, నరేష్ శర్మ, వెంకట రామశర్మ, ఆదిత్య శర్మతో పాటు పలువురు వేదపండితులు యాగ క్రతువులను నిర్వహించారు. రోజంతా వరుణ యాగం కొనగసాగగా, మధ్యాహ్నం 3.24 గంటలకు మహా పూర్ణాహుతితో ముగిసింది.


