ఆఫీసర్ల లాగిన్ల ద్వారా 2 వేల దాకా అప్లికేషన్ల సమర్పణ
ఈ నెల 31 వరకు దాఖలు... ఆ తర్వాత వాటి పరిశీలన
సాక్షి, హైదరాబాద్: కొత్త చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. గత శుక్రవారం రాత్రి నుంచే జిల్లాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ లాగిన్‌ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇప్పటి వరకు ఆఫీసర్ల లాగిన్ల ద్వారా 2 వేల దాకా అప్లికేషన్లు దాఖలైనట్టుగా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల కొత్త చేయూత పింఛన్లు మంజూరు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా...ఇది దశల వారీగానే ఇవ్వడం సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇందులో తొలివిడతగా 50 వేల పింఛన్లు ఇచ్చే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెలాఖరు దాకా దరఖాస్తుల సమర్పణకు అవకాశమున్నట్టు తెలుస్తోంది. మళ్లీ వాటి పరిశీలన ప్రక్రియ పూర్తికి రెండు వారాలు పట్టే అవకాశముంది. ఈ అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తయ్యాక జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వీటి ఆమోదానికి వారం, పదిరోజులు కలిపి మొత్తం నెలన్నర రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక అక్టోబర్ 1 నుంచే దశల వారీగానే కొత్త పింఛన్ల పంపిణీకి అవకాశమున్నట్టుగా తెలుస్తోంది.
ఓఏపీ కేటగిరీకి ఎందుకు లేదు ?
చేయూత పింఛన్లు అనగానే మొదట గుర్తుకు వచ్చేది వృద్ధాప్య (ఓఏపీ–ఓల్డ్ ఏజ్ పెన్షన్స్) పింఛనే. ప్రస్తుతం మంజూరు చేయనున్న పింఛన్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వీటిని మినహాయించడం పట్ల అటు అధికార వర్గాల్లో, ఇటు ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో...ఈ కేటగిరీ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగితే రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుందనే కారణంతోనే ప్రభుత్వం దీనిని పక్కన పెట్టి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


