ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి.. కుటుంబీకుల ఆరోపణలు | Girl Dies After RMP Delays Treatment Incident Of Khammam District Telangana | Sakshi
Sakshi News home page

ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి.. కుటుంబీకుల ఆరోపణలు

Aug 10 2026 1:31 PM | Updated on Aug 10 2026 2:02 PM

Girl Dies After RMP Delays Treatment Incident Of Khammam District Telangana

తెలంగాణ: ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం: ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్న అనంతరం బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. వైద్యంలో భాగంగా అధిక మోతాదులో మందులు, ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించసాగారు.

కుటుంబీకుల వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా హేమశ్రీ (13) కొణిజర్ల కస్తూరిబా కళాశాలలో 8వ తరగతి చదువుతోంది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం వరకు గ్రామస్తులు, స్నేహితులతో కలిసి హేమశ్రీ ఉత్సాహంగా గడిపింది. అనంతరం బాలికకు జలుబు, దగ్గు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు ఇంజక్షన్ ఇవ్వడంతో పాటు మందులు అందించారు. కానీ కాసేపటికే బాలిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారగా, విషయాన్ని గ్రహించిన కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు పరిస్థితి విషమించిందని అప్పటికే మార్గం మధ్యలోనే మృతి చెందిందని చెప్పారు.

అయితే, ఆర్ఎంపీ డాక్టర్‌ అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోలీసుల ఆధ్వర్యంలో స్వగ్రామానికి తరలించారు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. అలాగే, బాలిక మృతికి గల అసలు కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement