సూర్య నటించిన వీడొక్కడే గుర్తుందా?. అందులో డ్రగ్స్‌ను పొట్టలో ఉంచుకుని.. బాత్రూమ్‌కు కూడా పోకుండా స్మగ్లింగ్ చేస్తుంటారు. అది వాస్తవంగా జరిగేదే!. అయితే బంగారం అక్రమ రవాణాకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్న స్మగ్లర్లకు అధికారులు షాక్ ఇస్తున్నారు. తాజాగా.. శరీరం ప్రైవేట్‌పార్ట్‌లో దాచుకుని బంగారం తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం.. సర్ఫరాజ్ మాలా అనే ప్రయాణికుడు ఖతార్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో జెడ్డా నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా అతడిపై అనుమానం రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతడి మలద్వారంలో దాచిన బంగారం ప్యాకెట్లను గుర్తించారు. వాటిని బయటకు తీసి పరిశీలించగా.. మొత్తం 467.09 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.65.69 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
కడ్డీగా మార్చగా బరువు తగ్గింది
స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కరిగించి కడ్డీగా మార్చిన తర్వాత దాని బరువు 422.83 గ్రాములకు చేరిందని అధికారులు వెల్లడించారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నందుకు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎవరైనా స్మగ్లింగ్ ముఠా ఉందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కొనసాగుతున్న అక్రమ రవాణా ప్రయత్నాలు
విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు శరీర భాగాల్లో దాచడం, ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్లను ఉపయోగించడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్, భద్రతా సిబ్బంది తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి కలకలం రేపింది.


