పెద్ది సుదర్శన్‌రెడ్డికి నివాళులర్పిస్తున్న కేటీఆర్, చిత్రంలో హరీశ్‌రావు, పెద్ది స్వప్న, కుటుంబసభ్యులు
రెండేళ్లలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుంది
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంస్మరణ సభలో భావోద్వేగంగా కేటీఆర్
పెద్ది సేవలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమైన హరీశ్‌రావు
సాక్షి, వరంగల్/నర్సంపేట: తెలంగాణ ఉద్యమ బిడ్డ పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఉద్యమ గడ్డ ఘనమైన గౌరవం ఇచ్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, పెద్ది ఆశయాల మేరకు నర్సంపేటను అభివృద్ధి చేస్తామన్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది దశదిన కర్మ సందర్భంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఆయన నివాళులర్పించారు.
పెద్ది అంతిమయాత్రకు కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఓరుగల్లు మొత్తం కదిలివచ్చిందని, 12 గంటలపాటు లక్షలాది మంది తరలిరావడం ప్రజల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టకపోయినా తెలంగాణ ఉద్యమంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాటాలకు నాయకత్వం వహించిన మహోన్నత ప్రజానాయకుడని కొనియాడారు.చివరి రోజుల్లోనూ దేవాదుల నీటి కోసం, విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసేందుకు పెద్ది తపించారని గుర్తుచేసుకున్నారు. కరోనా, ఆర్థిక సంక్షోభ సమయంలోనూ నర్సంపేటలో ఇంటింటికీ పైపులైన్ గ్యాస్ అందించారని, రైతుల కోసం రూ.100 కోట్ల ప్రత్యేక ప్రాజెక్టును సాధించారని తెలిపారు. పెద్ది భార్య స్వప్న, వారి పిల్లలు, కుటుంబసభ్యులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకున్నా: హరీశ్
పెద్ది లేని నర్సంపేటను ఊహించలేకపోతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఉద్యమ సమయంలో పోలీసులతో జరిగిన తోపులాటలో డీసీఎం పైనుంచి కిందపడిపోయిన నన్ను.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. అదే ఆస్పత్రిలో ఆయనను నేను చివరిచూపు చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అంటూ హరీశ్ కన్నీటిపర్యంతమయ్యారు. తెలంగాణ కోసం ప్రాణాలు, ఆస్తులు, పదవులు లెక్కచేయకుండా పెద్ది పోరాడారన్నారు. మానుకోట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉపఎన్నికల్లో ఆయన పోరాట స్ఫూర్తి మరువలేనిదన్నారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ, రామప్ప, పాకాల, లక్నవరం చెరువులకు దేవాదుల నీళ్లు సాధించడంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ సభలో పార్టీ ముఖ్యనేతలతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్రిక్తత మధ్య విగ్రహావిష్కరణ
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ప్రతిష్ట తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. స్థానిక మెడికల్ కాలేజీ సమీపంలో విగ్రహం పెట్టాలని నిర్ణయించగా సంబంధిత నిర్మాణాన్ని ఆదివారం రాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో సోమవారం ఉదయం పలువురు నాయకులు ఆందోళనకు దిగారు. కూల్చిన ప్రదేశంలోనే మళ్లీ గద్దె నిర్మించగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


