మరోసారి మెగా వేలానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్
కోకాపేట్ నియోపొలిస్, గోల్డ్‌మైల్ లే అవుట్‌లపై ప్రధానంగా దృష్టి
మోకిలా తదితర ప్రాంతాల్లోని భూములకు సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ బిడ్డింగ్
ఎలివేటెడ్ కారిడార్‌లు, రేడియల్ రోడ్లు, మెట్రో స్వాదీనానికి నిధుల సేకరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి భూముల అమ్మకాలకు చర్యలు చేపట్టింది. రూ.3 వేల కోట్లు సమీకరణ లక్ష్యంగా.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లు, భూ విభాగాలు, ఎకరానికి పైగా విస్తీర్ణం కలిగిన భూముల విక్రయానికి తాజాగా నోటిఫికేషన్ వెలువరించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థలాలకు ఆగస్టు నెలాఖరులో ప్రీబిడ్డింగ్ సమావేశాలను ఏర్పాటు చేసి సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కోకాపేట్‌లో ఎకరానికి రూ.150 కోట్ల వరకు ధర రావడంతో ప్రస్తుతం కోకాపేట్‌లోని నియోపొలిస్, గోల్డ్‌మైల్ లే అవుట్‌లలోని భూములపై అధికారులు మరోసారి సీరియస్‌గా దృష్టి సారించారు. నియోపొలిస్‌లో ఎకరానికి రూ.120 కోట్లు, గోల్డ్‌మైల్‌లో రూ.70 కోట్ల చొప్పున కనీస ధర నిర్ణయించారు. నియోపొలిస్‌లోని 239, 240 సర్వే నంబర్లలో ప్రస్తుతం 4.59 ఎకరాలు అమ్మకానికి సిద్ధంగా ఉంది. అలాగే గోల్డ్‌మైల్‌లో 0.70 ఎకరాలను విక్రయించనున్నారు. ఈ లే అవుట్‌లలోని భూములకు ఈ నెల 25న ప్రీబిడ్డింగ్ సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 9వ తేదీన ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించనున్నారు. బిడ్డింగ్‌లో పాల్గొనేవారు సెప్టెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
మోకిలాలో 35 ప్లాట్లు..
కోకాపేట్, రాయదుర్గం, హైటెక్ సిటీ, మోకిలా, తదితర ప్రాంతాలు దిగ్గజ నిర్మాణ సంస్థలను, అంతర్జాతీయ వ్యాపారవర్గాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ ప్రాంతాల్లో భూముల అమ్మకాలకు మరోసారి పెద్ద ఎత్తున స్పందన లభించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ, వ్యాపార వర్గాలను ఎక్కువగా ఆకర్షిస్తున్న మోకిలాలో మరో 35 ప్లాట్లను విక్రయించేందుకు సెప్టెంబర్ 2వ తేదీన వేలం నిర్వహించనున్నారు. ఈ నెల 19న ప్రీబిడ్డింగ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కనిష్టంగా 300 చ.గజాల నుంచి గరిష్టంగా 500 చ.గ.ల వరకు విస్తీర్ణం కలిగిన ప్లాట్లు వీటిల్లో ఉన్నాయి. గతంలో గజం రూ.లక్షకు పైగా ధర పలికిన దృష్ట్యా ఈసారి అంతకంటే ఎక్కువ మొత్తంలోనే డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతంగజానికి రూ.55 వేల చొప్పున కనీస ధరను నిర్ణయించారు.
బాచుపల్లి స్థలాలకు మరోసారి వేలం
బాచుపల్లిలో గతంలో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. దీంతో మరోసారి ఈ స్థలాలను వేలం వేయాలని నిర్ణయించారు. కనిష్టంగా 266 గజాల నుంచి గరిష్టంగా 499 గజాల వరకు మొత్తం 35 ప్లాట్లు ఉన్నాయి. ఈ స్థలాలకు రూ.45 వేల కనీస ధర నిర్ణయించారు. మోకిలా, బాచుపల్లి ప్లాట్లకు సెప్టెంబర్ 2వ తేదీన బిడ్డింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు, ఫరూక్‌నగర్ మండలాల్లో ఉన్న ఇన్ముల్ నెర్వా హెచ్‌ఎండీఏ లే అవుట్‌లో 60 ప్లాట్లను విక్రయించనున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేవిధంగా ఇక్కడ గజానికి రూ.15 వేల చొప్పున కనీస ధరను నిర్ణయించారు. కనిష్టంగా 152 గజాల నుంచి గరిష్టంగా 300 గజాల విస్తీర్ణం వరకు ప్లాట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 3వ తేదీన బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్లాట్లకు ఈ నెల 22న ప్రీబిడ్డింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. కొనుగోలుదారులు సెప్టెంబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
సరూర్‌నగర్ హాట్‌కేక్
సరూర్‌నగర్‌లోని 4,355 గజాల స్థలానికి సెప్టెంబర్ 7వ తేదీన బిడ్డింగ్ ఉంటుంది. ఈ నెల 25న ప్రీబిడ్డింగ్ నిర్వహించనున్నారు. హెచ్‌ఎండీఏకు చెందిన ఈ స్థలం వ్యాపార, వాణిజ్య వర్గాలను, నిర్మాణ సంస్థలను ఆకట్టుకునే విధంగా ఉండడంతో గజానికి రూ.1,50,000 చొప్పున కనీస ధరను నిర్ణయించారు. అలాగే హైదర్‌నగర్‌లో మరో 3,454 గజాల స్థలాన్ని విక్రయించనున్నారు. ఇక్కడ గజానికి రూ.95 వేల చొప్పున కనీస ధర నిర్ణయించారు. ఈ స్థలాలతో పాటు గండిపేట్‌లోని బైరాగిగూడ (2,420 గజాలు), చందానగర్ (484 గజాలు), నార్సింగి (2,420 గజాలు), సూరారం (4,840 గజాలు) కాప్రా (484 గజాలు), అమీన్‌పూర్ ( 1,452 గజాలు)లోని భూ విభాగాలకు ఈ నెల 24న బిడ్డింగ్ నిర్వహించనున్నారు.
ప్రాజెక్టులకు నిధుల కోసం..
వివిధ ప్రాంతాల్లోని భూములు, ప్లాట్ల అమ్మకాల ద్వారా సుమారు రూ.3 వేల కోట్లకు పైగా లభించవచ్చునని అధికారుల అంచనా. ప్రస్తుతం జేబీఎస్–శామీర్‌పేట్, జేబీఎస్–డెయిరీ ఫామ్ ఎలివేటెడ్ కారిడార్‌లతో పాటు, రేడియల్ రోడ్లు, మెట్రో మొదటి దశ స్వా«దీనానికి నిధుల సేకరణలో భాగంగా ఈ భూములను విక్రయించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.


