ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ
ఇద్దరు మహిళలు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆర్మూర్ టౌన్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవింద్‌పేట్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీ సులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించడానికి రెండు టూరిస్ట్ బస్సులలో బయలు దేరారు. ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో జాతీయ రహ దారిపై ఓ బస్సు టైర్ పంక్చర్ కావడంతో దానిని డివైడర్ పక్కనే నిలిపివేశారు. ఆ బస్సు నలుపు రంగులో ఉండటంతో వెనకనుంచి వచ్చే వాహనాలకు కనిపించదన్న ఉద్దేశంతో రెండో బస్సును దాని వెనకాలే నిలిపారు.కొందరు టూరిస్ట్‌లు కిందికి దిగి డివైడర్‌పై కూర్చున్నారు.
ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ.. ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత (54), మాధవి (47) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


