గణనీయంగా పెరిగిన వరిసాగు
సాధారణ సాగు విస్తీర్ణం 65.96 లక్షల ఎకరాలు కాగా 63% పూర్తి
ఇతర పంటల సాగులోనూ పురోగతి
మొత్తంగా 132 లక్షల ఎకరాలకుగాను 107 లక్షల ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వానాకాలం (ఖరీఫ్) సాగు ఊపందుకుంది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత పది రోజుల్లోనే దాదాపు 10 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 41.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 65.96 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 63 శాతం పూర్తయింది. మొత్తం పంటల విషయానికొస్తే.. 132.38 లక్షల ఎకరాల సాధారణ సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 107.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. అంటే 81 శాతం సాగు పూర్తయింది.
నిజానికి వర్షాలు ఆలస్యం కావడంతో జూన్, జూలైలో సాగుపై కొంత సందిగ్ధత నెలకొంది. ఎల్‌నినో ఆందోళనకు గురిచేసింది. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో పరిస్థితి మారింది. చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో పాటు ప్రాజెక్టుల కింద సాగునీటి లభ్యత, భూముల్లో తేమ పెరగడంతో రైతులు పంటల సాగు, వరి నాట్లు ముమ్మరం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నాటికి 30 లక్షల లోపు ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెపుతుండగా..తర్వాత 10 రోజుల వ్యవధిలోనే ఈ విస్తీర్ణం సుమారు 10 లక్షల ఎకరాలు పెరిగింది. మరో వారం రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
సాధారణ విస్తీర్ణం కన్నా అధికంగా పత్తి సాగు
ఇతర పంటల సాగులోనూ మంచి పురోగతి కనిపిస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 47.41 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 47.72 లక్షల ఎకరాల్లో (101 శాతం) సాగైంది. పప్పుధాన్యాల సాగు 6.38 లక్షల ఎకరాలకు చేరి 98 శాతం పూర్తయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే కంది 93 శాతం, పెసర 149 శాతం, మినుము 95 శాతం సాగయ్యాయి. మొక్కజొన్న 5.31 లక్షల ఎకరాల్లో (86 శాతం), నూనెగింజలు 3.79 లక్షల ఎకరాల్లో (85 శాతం) సాగయ్యాయి. సోయాబీన్ 3.72 లక్షల ఎకరాల్లో వేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 100% మించి..
జిల్లాల వారీగా చూస్తే ఉత్తర తెలంగాణలో పంటల సాగు వేగంగా సాగుతోంది. ఆదిలాబాద్‌లో సాధారణ సాగులో 101 శాతం, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 102 శాతం, నిర్మల్‌లో 102 శాతం నమోదైంది. నిజామాబాద్‌లో 98 శాతం, కామారెడ్డిలో 96, పెద్దపల్లిలో 92, సంగారెడ్డిలో 96 శాతం చొప్పున సాగు పూర్తయింది. తద్వారా ఈ జిల్లాల్లో సాధారణ సాగు లక్ష్యం దాదాపుగా పూర్తయింది.
మరోవైపు ఉమ్మడి వరంగల్, దక్షిణ తెలంగాణలో సాగు ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదు. వరంగల్‌లో 61 శాతం, హనుమకొండలో 73, మహబూబాబాద్‌లో 62, ములుగులో 60, జనగామలో 79, సిద్దిపేటలో 75, మెదక్‌లో 84 శాతం చొప్పున సాగు నమోదు అయ్యింది. దక్షిణ తెలంగాణలో మహబూబ్‌నగర్ 66 శాతం, వనపర్తి 66, జోగుళాంబ గద్వాల 63, వికారాబాద్ 72, రంగారెడ్డి 74 శాతంతో వెనుకబడి ఉన్నాయి. సూ ర్యాపేటలో అత్యల్పంగా 59 శాతం సాగైంది.
వెంటాడుతున్న ఎల్‌నినో భయం
ఇప్పటివరకు కురిసిన వర్షాలతో రైతులు భారీగా పంటలు సాగు చేసినా.. ముందున్న వా తావరణ పరిస్థితులపై ఆందోళన కొనసాగుతోంది. ఎల్‌నినో ప్రభావంతో మళ్లీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పరిస్థితి ఏమిటన్నది రైతు లను, ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. పంట లు కీలక దశకు చేరుకునే సమయంలో వర్షాలు ముఖం చాటేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న భయం నెలకొంది. ముఖ్యంగా వరి సాగుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎల్‌నినో ప్రభావా న్ని అంచనా వేస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.


