ఉదయం జారీ చేసిన ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన బీసీఐ
నల్సార్ 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌కు మార్గం సుగమం
నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో పేరు నమోదుకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌పై తొలుత నిషేధం విధించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఆ తర్వాత వెనక్కి తగ్గింది. వర్సిటీ స్నాతకోత్స వానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రచారంలో ఈ బ్యాచ్ విద్యార్థుల ప్రమేయం ఉందన్న ఆరోపణలతో గురువారం ఉదయం విధించిన ఎన్‌రోల్‌మెంట్ నిషేధాన్ని రాత్రికి ఉపసంహరించుకుంది. తాజా నిర్ణయంతో 2026లో లా డిగ్రీ పూర్తి చేసిన నల్సార్ విద్యార్థులందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా ఎన్‌రోల్ చేసుకునేందుకు మార్గం సుగమమైంది.
అంతలోనే వెనక్కి...
సీజేఐకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో ఈ బ్యాచ్‌కు చెందిన అధిక శాతం విద్యార్థులకు ఎలాంటి సంబంధం లేదని, వారు అమాయకులని బీసీఐ తాజా విచారణ నివేదికల ఆధారంగా నిర్ధారించింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించిన బీసీఐ సభ్యులు నిషేధాన్ని ఎత్తివేస్తూ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. అత్యధిక విద్యార్థులకు సీజేఐని అగౌరవపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కొద్దిమంది చేసిన తప్పునకు బ్యాచ్‌లోని విద్యార్థులందరినీ బాధ్యులను చేసి, వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేయడం సరికాదన్న నిర్ణయానికి బీసీఐ వచ్చింది. అనంతరం బీసీఐ చైర్మన్ గురువారం ఉదయం ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ రాత్రి మరో ప్రకటన విడుదల చేసింది.
అసలేం జరిగిందంటే...
ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నల్సార్ వర్సిటీ స్నాతకోత్సవానికి ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరు విద్యార్థులు క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. దీనిపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా.. 2026లో నల్సార్ నుంచి లా డిగ్రీ పొందిన ఏ ఒక్క విద్యారి్థని కూడా అడ్వొకేట్‌గా ఎన్‌రోల్ చేయకూడదని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం ఉంటుందని అందులో పేర్కొన్నారు. ఈ ఆందోళనల వెనుక ఉన్న వారిని గుర్తించి, పక్కా ఆధారాలతో మూడు రోజుల్లోగా వాస్తవ నివేదికను సమరి్పంచాలని నల్సార్ వీసీని తొలుత ఆ ఉత్తర్వుల్లో బీసీఐ ఆదేశించింది. ఆయా విద్యార్థుల పూర్తి జాబితాను అధికారిక రికార్డుల నుంచి తీసి పంపాలని ఆదేశించింది. క్యాంపెయిన్‌ను డ్రాఫ్ట్ చేసిన వారు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన వారు, పత్రికలకు సమాచారం ఇచ్చిన వారు, అధికారిక గ్రూపులను అడ్మినిస్ట్రేట్ చేసిన వారిని గుర్తించాలని కోరింది. స్నాతకోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చిన వారి వివరాలను నివేదికలో పొందుపరచాలని పేర్కొంది. అయితే, ఆ తర్వాత క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించిన అనంతరం అమాయకులైన మెజారిటీ విద్యార్థులకు న్యాయం చేస్తూ బీసీఐ నిషేధాన్ని ఎత్తివేసింది.
31న తుది ఉత్తర్వులు
తెలంగాణ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన మధ్యంతర ఎన్‌రోల్‌మెంట్ కమిటీ ద్వారా చేపట్టిన న్యాయవాదుల ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. కమిటీ ఏర్పాటు చట్టవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్‌లో ఇటీవల ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31న దీనిపై తుది ఉత్తర్వులు జారీ చేయనుంది.


