అమెరికా–చైనా వాణిజ్య పోరు మరో కీలక మలుపు తిరిగింది. చైనాపై అమెరికా విధించిన భారీ టారిఫ్‌లను తప్పించుకునేందుకు.. భారత్ సహా 40కిపైగా దేశాల మీదుగా చైనా తన వస్తువులను అమెరికా మార్కెట్‌లోకి పంపుతోందని అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ‘షాడో ట్రాన్స్‌షిప్‌మెంట్ నెట్‌వర్క్’గా అభివర్ణించారు. అంతేకాదు.. ఇక ఇలాంటి సరుకులను గుర్తించేందుకు అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను రంగంలోకి దింపబోతోంది. దీంతో అసలు చైనా ఏం చేస్తోంది? భారత్ పేరు ఈ వ్యవహారంలో ఎందుకు వచ్చింది? అమెరికా చెప్పే ‘ట్రాన్స్‌షిప్‌మెంట్’ అంటే ఏమిటి? అన్న ఆసక్తి మొదలైంది.
‘ది గ్రేట్ ట్రాన్స్‌షిప్‌మెంట్ స్కామ్’ పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో తయారైన వస్తువులు నేరుగా అమెరికాకు వెళ్తే భారీ టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సరుకులను మూడో దేశాల మీదుగా అమెరికాకు పంపుతున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో వస్తువులను మరో దేశానికి పంపించి అక్కడ రీప్యాకేజింగ్, రీలేబెలింగ్, స్వల్ప స్థాయి ప్రాసెసింగ్, ఇన్వాయిస్ లేదా షిప్పింగ్ మార్గంలో మార్పులు చేస్తున్నారని అమెరికా పేర్కొంది. దీంతో అసలు వస్తువు చైనాలో తయారైనప్పటికీ.. పత్రాల్లో అది మరో దేశం నుంచి వచ్చినట్లుగా కనిపించే అవకాశం ఉంటుందని తెలిపింది.
అంటే.. చైనా సరుకు.. మధ్యలో మరో దేశం.. చివరికి అమెరికా మార్కెట్! ఇదే అమెరికా ఆరోపిస్తున్న ట్రాన్స్‌షిప్‌మెంట్ విధానం. ఈ నెట్‌వర్క్‌లో భారత్‌తో పాటు మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల పేర్లను కూడా నవారో ప్రస్తావించారు. ఈ మార్గంలో అక్రమంగా మళ్లుతున్న వస్తువుల విలువ ఏటా 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా నివేదిక అంచనా వేసింది. అయితే ఈ అంచనా ఉపయోగించిన పద్ధతి, ట్రాన్స్‌షిప్‌మెంట్‌కు ఇచ్చే నిర్వచనాన్ని బట్టి మారుతుందని స్పష్టం చేసింది.
టార్గెట్ భారత్..
ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా నివేదికలో పుణే,గుజరాత్,చెన్నై ఉత్పత్తి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా తయారు చేసిన పంపులు, కంప్రెషర్లు భారత్ మీదుగా అమెరికాకు చేరుతున్నాయని నవారో ఉదాహరణగా చెప్పారు. ఇక్కడే ఒక కీలక విషయాన్ని గమనించాలి. అమెరికా నివేదికలో భారత్ పేరు రావడం అంటే భారతదేశం మొత్తం అక్రమంగా చైనాకు సహకరిస్తోందని అర్థం కాదు. నిజమైన భారతీయ తయారీ, చట్టబద్ధమైన ప్రాసెసింగ్, విదేశీ పెట్టుబడులు, సరఫరా గొలుసుల మార్పులను కూడా అక్రమ ట్రాన్స్‌షిప్‌మెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకే అమెరికా ఇప్పుడు తన తదుపరి ఆయుధంగా AIని ఉపయోగించబోతోంది.
‘డిటెక్టివ్ బోర్డర్’గా పేర్కొన్న AI ఆధారిత వ్యవస్థ ద్వారా అమెరికా అధికారులు షిప్‌మెంట్‌లకు సంబంధించిన భారీ డేటాను విశ్లేషించనున్నారు. సరుకు ఎక్కడి నుంచి బయలుదేరింది? దాని గత రూట్ ఏంటి? తయారీదారు ఎవరు? కంపెనీల యాజమాన్య సంబంధాలు ఏంటి? ఒక దేశానికి అంత భారీగా ఆ వస్తువులను తయారు చేసే సామర్థ్యం ఉందా? ఉత్పత్తి వర్గీకరణలో ఏమైనా అనుమానాలున్నాయా? వంటి అంశాలను పరిశీలించనున్నారు. అనుమానం బలపడితే.. సరుకును అడ్డుకోవడం, అదనపు సుంకాలు వసూలు చేయడం, జరిమానాలు విధించడం లేదా అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశాన్ని నిరోధించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇదంతా ఎందుకు?
2018లో చైనాపై అమెరికా సెక్షన్ 301 కింద టారిఫ్‌లు విధించిన తర్వాత.. చైనా ఎగుమతులు మూడో దేశాల ద్వారా మళ్లించే విధానం పెరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. భారీ సుంకాల నుంచి తప్పించుకునేందుకు మూడో దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని వాషింగ్టన్ వాదిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా వ్యూహం మారుతోంది. గతంలో ‘చైనా నుంచి నేరుగా వస్తోందా?’ అని చూసే స్థాయి నుంచి.. ఇక ‘చైనా నుంచి వచ్చి మధ్యలో ఏ దేశాల మీదుగా తిరిగి వచ్చింది?’ అనే స్థాయికి తనిఖీలు వెళ్లబోతున్నాయి.
భారత్‌పై ఎఫెక్ట్?
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్న సమయంలో.. భారతదేశాన్ని చైనా టారిఫ్‌లను తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు పెరిగితే, కొన్ని భారతీయ ఎగుమతులపై అదనపు తనిఖీలు లేదా చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు.. అమెరికా ఆరోపణలకు తగిన ఆధారాలు, నిర్దిష్ట కేసులు, అధికారిక దర్యాప్తు ఫలితాలు బయటకు రావాల్సి ఉంది. కేవలం ఒక నివేదికలో దేశం పేరు ప్రస్తావించబడటాన్ని బట్టి మొత్తం భారత ఎగుమతి రంగంపై తీర్పు ఇవ్వడం సరికాదు.


