breaking news
India Trade Fare
-
చైనా గేమ్‌లో పావుగా భారత్?.. అమెరికా షాకింగ్ ఆరోపణలు
అమెరికా–చైనా వాణిజ్య పోరు మరో కీలక మలుపు తిరిగింది. చైనాపై అమెరికా విధించిన భారీ టారిఫ్‌లను తప్పించుకునేందుకు.. భారత్ సహా 40కిపైగా దేశాల మీదుగా చైనా తన వస్తువులను అమెరికా మార్కెట్లోకి పంపుతోందని అమెరికా ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని అమెరికా వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ‘షాడో ట్రాన్స్షిప్మెంట్ నెట్వర్క్’గా అభివర్ణించారు. అంతేకాదు.. ఇక ఇలాంటి సరుకులను గుర్తించేందుకు అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను రంగంలోకి దింపబోతోంది. దీంతో అసలు చైనా ఏం చేస్తోంది? భారత్ పేరు ఈ వ్యవహారంలో ఎందుకు వచ్చింది? అమెరికా చెప్పే ‘ట్రాన్స్షిప్మెంట్’ అంటే ఏమిటి? అన్న ఆసక్తి మొదలైంది.‘ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్’ పేరుతో అమెరికా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. చైనాలో తయారైన వస్తువులు నేరుగా అమెరికాకు వెళ్తే భారీ టారిఫ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొన్ని సరుకులను మూడో దేశాల మీదుగా అమెరికాకు పంపుతున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో వస్తువులను మరో దేశానికి పంపించి అక్కడ రీప్యాకేజింగ్, రీలేబెలింగ్, స్వల్ప స్థాయి ప్రాసెసింగ్, ఇన్వాయిస్ లేదా షిప్పింగ్ మార్గంలో మార్పులు చేస్తున్నారని అమెరికా పేర్కొంది. దీంతో అసలు వస్తువు చైనాలో తయారైనప్పటికీ.. పత్రాల్లో అది మరో దేశం నుంచి వచ్చినట్లుగా కనిపించే అవకాశం ఉంటుందని తెలిపింది.అంటే.. చైనా సరుకు.. మధ్యలో మరో దేశం.. చివరికి అమెరికా మార్కెట్! ఇదే అమెరికా ఆరోపిస్తున్న ట్రాన్స్షిప్మెంట్ విధానం. ఈ నెట్‌వర్క్‌లో భారత్‌తో పాటు మెక్సికో, కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల పేర్లను కూడా నవారో ప్రస్తావించారు. ఈ మార్గంలో అక్రమంగా మళ్లుతున్న వస్తువుల విలువ ఏటా 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అమెరికా నివేదిక అంచనా వేసింది. అయితే ఈ అంచనా ఉపయోగించిన పద్ధతి, ట్రాన్స్‌షిప్‌మెంట్‌కు ఇచ్చే నిర్వచనాన్ని బట్టి మారుతుందని స్పష్టం చేసింది.టార్గెట్ భారత్..ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా నివేదికలో పుణే,గుజరాత్,చెన్నై ఉత్పత్తి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చైనా తయారు చేసిన పంపులు, కంప్రెషర్లు భారత్ మీదుగా అమెరికాకు చేరుతున్నాయని నవారో ఉదాహరణగా చెప్పారు. ఇక్కడే ఒక కీలక విషయాన్ని గమనించాలి. అమెరికా నివేదికలో భారత్ పేరు రావడం అంటే భారతదేశం మొత్తం అక్రమంగా చైనాకు సహకరిస్తోందని అర్థం కాదు. నిజమైన భారతీయ తయారీ, చట్టబద్ధమైన ప్రాసెసింగ్, విదేశీ పెట్టుబడులు, సరఫరా గొలుసుల మార్పులను కూడా అక్రమ ట్రాన్స్షిప్మెంట్ నుంచి వేరు చేయాల్సి ఉంటుంది. అందుకే అమెరికా ఇప్పుడు తన తదుపరి ఆయుధంగా AIని ఉపయోగించబోతోంది.‘డిటెక్టివ్ బోర్డర్’గా పేర్కొన్న AI ఆధారిత వ్యవస్థ ద్వారా అమెరికా అధికారులు షిప్మెంట్లకు సంబంధించిన భారీ డేటాను విశ్లేషించనున్నారు. సరుకు ఎక్కడి నుంచి బయలుదేరింది? దాని గత రూట్ ఏంటి? తయారీదారు ఎవరు? కంపెనీల యాజమాన్య సంబంధాలు ఏంటి? ఒక దేశానికి అంత భారీగా ఆ వస్తువులను తయారు చేసే సామర్థ్యం ఉందా? ఉత్పత్తి వర్గీకరణలో ఏమైనా అనుమానాలున్నాయా? వంటి అంశాలను పరిశీలించనున్నారు. అనుమానం బలపడితే.. సరుకును అడ్డుకోవడం, అదనపు సుంకాలు వసూలు చేయడం, జరిమానాలు విధించడం లేదా అమెరికా మార్కెట్లోకి ప్రవేశాన్ని నిరోధించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదంతా ఎందుకు?2018లో చైనాపై అమెరికా సెక్షన్ 301 కింద టారిఫ్‌లు విధించిన తర్వాత.. చైనా ఎగుమతులు మూడో దేశాల ద్వారా మళ్లించే విధానం పెరిగిందని అమెరికా ఆరోపిస్తోంది. భారీ సుంకాల నుంచి తప్పించుకునేందుకు మూడో దేశాలను మధ్యవర్తులుగా ఉపయోగిస్తున్నారని వాషింగ్టన్ వాదిస్తోంది. అయితే ఇప్పుడు అమెరికా వ్యూహం మారుతోంది. గతంలో ‘చైనా నుంచి నేరుగా వస్తోందా?’ అని చూసే స్థాయి నుంచి.. ఇక ‘చైనా నుంచి వచ్చి మధ్యలో ఏ దేశాల మీదుగా తిరిగి వచ్చింది?’ అనే స్థాయికి తనిఖీలు వెళ్లబోతున్నాయి.భారత్‌పై ఎఫెక్ట్?భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్న సమయంలో.. భారతదేశాన్ని చైనా టారిఫ్‌లను తప్పించుకునే మార్గంగా ఉపయోగిస్తున్నారన్న అనుమానాలు పెరిగితే, కొన్ని భారతీయ ఎగుమతులపై అదనపు తనిఖీలు లేదా చర్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు.. అమెరికా ఆరోపణలకు తగిన ఆధారాలు, నిర్దిష్ట కేసులు, అధికారిక దర్యాప్తు ఫలితాలు బయటకు రావాల్సి ఉంది. కేవలం ఒక నివేదికలో దేశం పేరు ప్రస్తావించబడటాన్ని బట్టి మొత్తం భారత ఎగుమతి రంగంపై తీర్పు ఇవ్వడం సరికాదు. -
అమెరికాతో వాణిజ్యం.. చైనాను వెనక్కు నెట్టిన ఇండియా
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం మెరుగ్గానే కొనసాగడం గమనార్హం. ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుగాంచిన అమెరికాతో భారత వాణిజ్య సంబంధాలు క్రమేపీ బలపడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబరు మధ్య చైనాను వెనక్కునెట్టి యూఎస్‌కు ఇండియా అతిపెద్ద ట్రేడ్ పార్టనర్‌గా ఉద్భవించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితితో పాటు ఎగుమతులు, దిగుమతుల్లో భారీ క్షీణత ఏర్పడింది. అయినప్పటికీ భారత్‌కు అమెరికా ఆతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 11.3 శాతం మేర క్షీణించి 59.67 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రభుత్వ తాత్కాలిక డేటా వెల్లడించింది. 2023 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికాకు ఎగుమతులు 38.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాదిలో 41.49 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఎగుమతులు తగ్గాయి. దిగుమతుల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 25.79 బిలియన్ డాలర్ల మేర భారత్ దిగుమతులు చేసుకోగా.. ఈసారి ఇది 21.39 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇక భారత్, చైనాల మధ్య వాణిజ్యం కూడా 3.56 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో చైనాకు ఎగుమతులు 7.84 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా 7.74 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు అంతకు ముందు ఏడాది 52.42 బిలియన్ డాలర్లు కాగా..ఇప్పుడు 50.47 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా ఇండియా, అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతులు క్షీణిస్తున్నాయి. వృద్ధి రేటు త్వరలోనే సానుకూలంగా మారుతుందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
క్షీణించిన భారత్ ఎగుమతులు, ఆగస్ట్‌లో ఎంత శాతం అంటే
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఇక దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు రెట్టింపునకు పైగా పెరిగి, 28.68 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు భారీగా పెరగడానికి క్రూడ్ ఆయిల్ దిగుమతులు ప్రధాన కారణం. ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
ట్రేడ్ ఫేర్‌లో డిజిటల్ తెలంగాణ పెవిలియన్
- ప్రారంభించనున్న మంత్రి చందూలాల్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సోమవారం ప్రారంభకానున్న భారత-అంతర్జాతీయ ట్రేడ్ ఫేర్‌లో తెలంగాణ రాష్ట్రం ‘డిజిటల్ తెలంగాణ’ పేరుతో పెవిలియన్‌ను ఏర్పాటు చేయనుంది. టీ-హబ్‌తోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాట్లు చేయనున్నారు. ఇన్నోవేషన్, ఇంక్యూబేషన్, స్టార్టప్ ఐటీ అనే మూడు అంశాలు డిజిటల్ తెలంగాణ త్రీడీ డిజైన్‌లో ప్రముఖంగా కనిపించున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రపంచ స్థాయి సంస్థలు తెలంగాణలో ఏర్పాటు కావడం, వాటికి కల్పిస్తున్న సదుపాయాలను తెలిపేవిధంగా పెవిలియన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర చేనేతాభివృద్ధి సంస్థ, హస్తకళలు, పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తదితర విభాగాలు తమ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. వీటిని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభించనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ఫేర్‌లో 21వ తేదీన ఒగ్గు డోలు, పేరిణి నృత్యం, ఖవ్వాలీ, కొమ్ము కోయ వంటి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యతను ప్రదర్శించనున్నారు.


