జయహో జగన్‌ | A large number of youths attend YS Jagans Kurnool visit | Sakshi
Sakshi News home page

జయహో జగన్‌

Aug 14 2026 4:01 AM | Updated on Aug 14 2026 4:01 AM

A large number of youths attend YS Jagans Kurnool visit

ఓర్వకల్లు నుంచి జిల్లా జైలు వద్దకు 38 కిలోమీటర్ల దూరానికి ఏకంగా 5 గంటలకు పైగా పట్టిన సమయం

జగన్‌ రాకే ఒక ప్రభంజనం... జన సందోహాలు, జనసంద్రాలే నిదర్శనం..  పరామర్శకెళ్లినా..పలకరింపునకు వచ్చినా ప్రజా సమూహాలకు పరమానందం.. ఆయన్ను చూడాలని, ఆయన మాట వినాలని పరితపించే హృదయాలకు హృద్యమమే.. సంద్రంలా కదిలివచ్చే తీరు ఉత్తుంగ తరంగమేహృదయ సంగమమే వీడని బంధంలా.. వదులుకోలేని అనుబంధంలా పెనవేసుకున్న ప్రేమానురాగాల్లా కళ్లను కట్టిపడేసే జన‘సిత్రాలు’ఎన్నో ఎన్నెన్నో... మా మనవడే వచ్చాడంటూ అవ్వృతాతలు.. నా బిడ్డే కదిలి వచ్చాడని అమ్మలు..మా తమ్ముడే తరలివస్తున్నాడని అక్కలు మా అన్నే వచ్చాడంటూ విద్యార్థులు..మా మార్గదర్శి వెంటేనంటూ జెన్‌ జీ తరం... పోటెత్తే సింధువులో బిందువుల్లా...రేపటి ఉద్యమానికి వారధుల్లా... జయ జయహో జగన్‌ అంటూ ప్రణమిల్లిన తీరుతో కర్నూలు పర్యటన యావత్తూ మురిసి మెరిసే..  

కర్నూలులో ‘జెన్‌ జీ’ జోష్‌.. 
జగన్‌ వెంట కదం తొక్కిన యువత... 
వైఎస్‌ జగన్‌ కర్నూలు పర్యటనలో పెద్ద సంఖ్యలో యువత కనిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జగన్‌ కాన్వాయ్‌ వెంట వేలాదిగా యువకులు బైకులపై కదం తొక్కారు. నన్నూరు, నన్నూరు టోల్‌ప్లాజా, గుత్తి పెట్రోల్‌ బంక్‌ జంక్షన్, చెన్నమ్మ సర్కిల్, సంతోష్ నగర్‌ కూడళ్లు యువత సందడితో హోరెత్తాయి. కేరింతలు, జై జగన్‌.. జై జై జగన్‌ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి.  

ఓ వైపు చేతుల్లో ప్లకార్డులు.. మరోవైపు బైక్‌లపై జగన్‌ కాన్వాయ్‌ వెంట ఉత్సాహంగా యువకులు సాగారు.. ‘ఇంటికో ఉద్యోగం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి’ హామీల అమలుపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ  కొందరు యువకులు ప్లకార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో ‘జగన్‌ నువ్వే మా దిక్కు.. నువ్వే మాకు భరోసా’ అంటూ మరికొందరు ప్లకార్డులను ప్రదర్శించారు. సోషల్‌మీడియాలో చురుగ్గా కనిపించే నేటి ‘జెన్‌ జీ’ తరం భారీగా రోడ్డెక్కడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. జగన్‌ పర్యటనలో యువత చూపిన ఉత్సాహం.. వారిలో ఆయనకు ఉన్న ఆదరణను చాటిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. 

ధైర్యంగా ఉండండి.. పార్టీ అండగా ఉంటుంది
ములాఖత్‌లో ఎమ్మెల్యే విరూపాక్షికి వైఎస్‌ జగన్‌ భరోసా
ఎమ్మెల్యే భార్య, చిన్న కుమారుడికి ధైర్యం చెప్పిన జననేత  
కర్నూలు (సెంట్రల్‌): అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి నేనున్నానంటూ వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గురువారం జిల్లా జైలులో ములాఖత్‌లో విరూపాక్షి, ఇతర నాయకులను వైఎస్‌ జగన్, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, విరూపాక్షి భార్య రామాంజనమ్మలతో సహా కలిశారు. 

వైఎస్‌ జగన్‌ విరూపాక్షితో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ఇతర నాయకులకు అండగా నిలవాలని సూచించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం జైలు వెలుపల విరూపాక్షి భార్య రామాంజనమ్మ, చిన్నకుమారుడు లక్ష్మీనారాయణలతో కూడా వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. విరూపాక్షి కుటుంబానికి అన్ని విధాలా అండదండలు అందించాలని పార్టీ నాయకులను జగన్‌ ఆదేశించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధైర్య పడవద్దని, అక్రమ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పారు.

  

అడుగడుగునా ఆంక్షలు.. బారికేడ్లు   
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జగన్‌ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అడుగడుగునా చెక్‌పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి జనం వస్తున్న వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. జగన్‌ పర్యటనకు అనుమతి లేదన్నారు. అయినా ఖాతరు చేయకుండా జనం తండోపతండాలుగా తరలివచ్చారు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద జనాన్ని అడ్డుకున్నారు. దాదాపు 200 వాహనాలను నిలిపివేశారు. కోడుమూరు, నాగలాపురం రేడియో స్టేషన్ల వద్ద చెక్‌పోస్టులు పెట్టి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

ఆదోని, ఆలూరు నుంచి రాకుండా అడ్డుపడ్డారు. తనిఖీల పేరుతో జనాన్ని నిలిపివేశారు. దేవనకొండ, వెల్దుర్తిల వద్ద చెక్‌పోస్టులు పెట్టి నిలిపివేశారు. కోడుమూరు, నాగలాపురం, కర్నూలు టౌన్, రిలయన్స్‌ మార్ట్‌ ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. కోడుమూరు దగ్గర చెక్‌పోస్టు పెట్టి నిలువరించారు. నంద్యాల ప్రాంతం నుంచి రాకుండా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి జిల్లా జైలు వరకు వేలాదిమంది పోలీసులను మోహరించారు. బెంగళూరు–హైదరాబాద్‌ హైవే పైకి ఎక్కే ప్రాంతంలో చెక్‌పోస్టులను పెట్టారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. 



   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement