నాగార్జున యాదవ్,సలాంబాబు
సిట్ నివేదిక పేరుతో యువత ఆశలపై విషం చిమ్మేందుకు చంద్రబాబు కూటమి యత్నం
డిజిటల్ మూల్యాంకనం తప్పు కాదని కోర్టు కూడా చెప్పింది.. హాయ్‌ల్యాండ్‌లో జరిగింది మూల్యాంకనం కాదు..
కేవలం డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లలో నమోదు చేశారు
ఈ విషయం సిట్ కూడా స్పష్టంగా చెప్పింది
జవాబు పత్రాలు ట్యాంపరింగ్ చేయలేదని సీఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు ఇచ్చాయి
గ్రూప్–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు, ఉద్యోగాలు పొందిన వారు అత్యంత ప్రతిభావంతులు
వారిలో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థల నుంచి వచ్చిన వారు ఉన్నారు
2018 గ్రూప్–1లో అక్రమాలు జరగలేదన్నది సుస్పష్టం: వైఎస్సార్‌సీపీ నేతలు నాగార్జున యాదవ్, సలాంబాబు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు కూటమి 2018లో జరిగిన గ్రూప్ –1 నియామకాలపై విషం చిమ్ముతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్, పార్టీ స్టేట్ యూత్ ఎంపవర్‌మెంట్ సెల్ కన్వీనర్ సలాంబాబు ధ్వజమెత్తారు. వారు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కూటమి యువత ఆశలపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని నాగార్జున యాదవ్ అన్నారు.
‘డిజిటల్ మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధమని ఎవరు చెప్పారు? ఈ విధానాన్ని భవిష్యత్తులో కూడా ఏపీపీఎస్సీ అనుసరించవచ్చని కోర్టు స్పష్టంగా చెప్పింది. కేవలం నోటిఫికేషన్‌లో పేర్కొనలేదనే కారణంతోనే ఆ నియామకానికి వర్తింపజేయొద్దని కోర్టు చెప్పింది. హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ప్రక్రియ రెండోసారి మూల్యాంకనం కాదని సిట్ స్పష్టంగా చెప్పింది. కేవలం డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులను ఓఎంఆర్ షీట్లలో నమోదు చేశారు. హాయ్‌ల్యాండ్‌లో జవాబు పత్రాలను మార్చలేదని, ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్‌లలో నమోదైన మార్కుల్లో ఎలాంటి తేడా లేదని సిట్ స్పష్టంగా చెప్పింది.
జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, 84 రోజుల పాటు హాయ్‌ల్యాండ్‌లో ఉన్నప్పటికీ అవి చెక్కుచెదరలేదని దేశంలోని ఏడు సీఎఫ్‌ఎస్‌ఎల్ కేంద్రాలు స్పష్టంగా చెప్పాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌లోనూ అభ్యర్థుల మార్కుల నమోదులో ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్‌లలో కరెక్షన్స్ సహజమే. ఎగ్జామినర్ తర్వాత చీఫ్ ఎగ్జామినర్, స్రూ్కటినైజర్ స్థాయిలోనూ జవాబు పత్రాలను పరిశీలిస్తారు. మానవ తప్పిదాలను నివారించేందుకే పలు దశల్లో పరిశీలించి అవసరమైన సవరణలు చేస్తారు. జవాబు పత్రాలను బండిల్‌గా చేసి అందులో జరిగిన కరెక్షన్స్ సంఖ్యను నమోదు చేసే విధానం కూడా ఉంది. 2016, 2018, 2022, 2024లో జరిగిన పరీక్షల్లోనూ ఇదే విధానం అమలైంది. ఎగ్జామినర్లే కరెక్షన్స్ చేసినట్లు స్పష్టంగా చెప్పారు’ అని నాగార్జున యాదవ్ చెప్పారు.
లోకేశ్ కోసం గ్రూప్–1అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు
డీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం, లోకేశ్ రాజకీయ భవిష్యత్తు కోసమే 163 మంది గ్రూప్ – 1 అభ్యర్థుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారని సలాంబాబు ధ్వజమెత్తారు. సిట్ నివేదికలోని వాస్తవాలను పక్కనపెట్టి, వారికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారన్నారు. సాధారణ మూల్యాంకన ప్రక్రియలో జరిగే కరెక్షన్స్‌ను అవకతవకలుగా చిత్రీకరించడం సరికాదని చెప్పారు. ‘జవాబు పత్రాల్లో కరెక్షన్స్ చేసింది తామేనని ఎగ్జామినర్లే సిట్ విచారణలో స్పష్టం చేశారు. కరెక్షన్స్ మూల్యాంకన ప్రక్రియలో భాగమే తప్ప అక్రమం కాదు.
2018 గ్రూప్–1లో ఎంపికైన అభ్యర్థుల్లో అత్యున్నత విద్యా సంస్థల్లో చదివిన ప్రతిభావంతులు ఉన్నారు. అర్హత లేని వారిని ఎంపిక చేశామని ఆరోపించడం ద్వారా ప్రతిభావంతులైన అభ్యర్థుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఎంపికైన వారిలో 19 మంది ఐఐటీ, 17 మంది ఎన్‌ఐటీ, 6 మంది ఐఐఎం నుంచి వచ్చారు. ఎంబీబీఎస్, బీడీఎస్ చేసిన 18 మంది కూడా ఎంపికయ్యారు. 39 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూకు వెళ్లిన వారు. వారిలో 16 మంది యూపీఎస్సీలో ఎంపికై ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లోకి వెళ్లారు. గ్రూప్ – 1 ఇంటర్వ్యూకు ఎంపికైన 325 మందిలో 103 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉన్నారు.
బ్యాంకింగ్, ఐటీ తదితర రంగాల్లో పనిచేస్తున్న 101 మంది కూడా ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులు కూడా గ్రూప్ – 1కు ఎంపికయ్యారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ మూల్యాంకన కేంద్రాలు, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. పరీక్షల్లో ఇంపర్సనేషన్‌ను అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రూప్ – 1 ఇంటర్వ్యూల్లో 24 మంది సీనియర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూ బోర్డుల్లో ఏపీపీఎస్సీ సభ్యులు, సీనియర్ అధికారులు, అకడమిషియన్లతో పారదర్శకమైన విధానం అమలు చేశారు.
ఇంటర్వ్యూ మార్కుల్లో నిర్దేశిత గ్రేడింగ్ విధానంలో ఎలాంటి వ్యత్యాసం గుర్తించలేదని సిట్ నివేదికే చెబుతోంది. అంటే గ్రూప్–1లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నది సుస్పష్టం. అక్రమాలే జరిగితే అదే అభ్యర్థులను ఇప్పుడు మీరే ఎందుకు నియమించుకున్నారు? కుప్పం డెవలప్మెంట్ అథారిటీలో 2018 గ్రూప్ – 1 అభ్యరి్థని చంద్రబాబు ప్రభుత్వం నియమించలేదా? డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలో నిలదీస్తామన్న భయంతోనే గ్రూప్ – 1 అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్‌గా తెరపైకి తెచ్చారు’ అని సలాంబాబు చెప్పారు.


